ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాట్లాడారు. కేంద్రం చేతిలో పావుగా మారిన సిబిఐ అనుమతి ఉపసంహరణ రద్దు నిర్ణయం పై ఆరా తీశారు. శుక్రవారం చంద్రబాబు నిర్ణయాన్ని మె సమర్థించింది. తరువాత ఆంధ్రప్రదేశ్ సీఎంవో అధికారులతో బెంగాల్ సీఎంవో అధికారులు మాట్లాడారు. తరువాత సీబీఐకి సాధారణ అనుమతులు రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కార్ కూడా జీవో జారీ చేసింది. మమతా బెనర్జీ కూడా ఏపీ తరహా నిర్ణయమే తీసుకున్నారు. సీబీఐకి 1989లో లెఫ్ట్ సర్కారు మంజూరు చేసిన ‘జనరల్ కన్సెంట్’ను శుక్రవారం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
దిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద పనిచేసే సీబీఐ అధికార పరిధి దిల్లీ వరకే ఉంది. ఇతర రాష్ట్రాల్లో ప్రవేశించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సమ్మతి అవసరం. పశ్చిమబెంగాల్‌లో ఇలాంటి అనుమతి ఆదేశాలను 1989లో నాటి వామపక్ష ప్రభుత్వం జారీ చేసింది. తాజాగా శుక్రవారం సాయంత్రం మమతాబెనర్జీ వాటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇక పై న్యాయస్థానం ఆదేశించిన కేసుల్లో తప్ప, సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం కోల్‌కతాలో నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సీబీఐ, ఆర్‌బీఐ వంటి కీలక సంస్థలను నాశనం చేస్తోందనీ, వాటి పనితీరును మార్చేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు.
సీబీఐకి అనుమతుల ఉపసంహరణపై స్పందిస్తూ అలాంటి నిబంధనల్ని ఉపయోగించుకోవడం తమకు అవసరం లేకపోయినా, భాజపా సీబీఐ తదితర సంస్థల్ని తమ రాజకీయ ప్రయోజనాల్ని, ప్రతీకారం తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటుండటం వల్ల ఆ పని చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. విగ్రహాల్ని ఏర్పాటు చేసే భాజపా లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓ విగ్రహంలా అవుతుందని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన భాజపాను అధికారం నుంచి దించివేయాలన్నారు. భాజపా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పేర్లను మార్చేసే ప్రక్రియలో ఉందన్నారు. భాజపాకు ఇప్పుడు మందిర్, ఎన్‌ఆర్‌సీ, విగ్రహం, మతరాజకీయాలు అనే నాలుగే అజెండాలు ఉన్నాయన్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా రథయాత్రను రావణయాత్రగా మమత అభివర్ణించారు.