ఈ రోజు ప్రకటించిన జగన్ మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రోజాకు కచ్చితంగా మంత్రి పదవి దొరకుతుందని ఆమె అనుచరులు గట్టిగానే ప్రచారం చేస్తూ వస్తున్నారు. కేవలం ప్రచారం మాత్రమే కాదు... ఏకంగా మహిళా కోటాలో హోంమంత్రి పదవే దక్కనుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. కేబినెట్ కూర్పు జరిగే చివరి నిమిషాల వరకు కూడా రోజా ఈసారి కచ్చితంగా మంత్రి అవుతారని అందరూ నమ్ముతూ వచ్చారు.కానీ చివరి నిమిషంలో కేబినెట్ కూర్పులో ఆమె పేరు కనిపించక పోవడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. మరోవైపు శనివారం ఉదయం వరకూ ఏవైనా అనూహ్య పరిణామాలు సంభవించి తమ తమ నేతలకు బెర్తులు లభించే అవకాశాలున్నాయని కార్యకర్తలు, అనుచరులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
జగన్ కేబినెట్ లిస్టు... స్పీకర్‌గా సీనియర్ నేత తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఎంపికయ్యారు. ఇక మంత్రి వర్గ సహచరులుగా బొత్స, ఆళ్ల నాని, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్,కొడాలి నాని, బాలరాజు, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కన్నబాబు, పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, విశ్వరూప్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, మోపిదేవి వెంకటరమణకు చోటు దక్కింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గత కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేసిన జగన్ ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులకు అవకాశం కల్పిస్తూ మంత్రివర్గాన్ని కూర్చారు. 25 మందితో కూడిన జాబితాను రూపొందించి గవర్నర్‌కు అందజేశారు.
పార్టీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలూ మంత్రి పదవులకు అర్హులే అయినప్పటికీ కొంతమందికి మాత్రమే అవకాశం ఉందని, రెండున్నరేళ్ల తర్వాత దాదాపు 20 మందిని మార్చి వారి స్థానంలో కొత్తవారికి మంత్రులుగా అవకాశం ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తున్నట్టు జగన్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 11.49గంటలకు వెలగపూడిలోని సచివాయలయం ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సభాపతిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం పేరును ఖరారు చేశారు. ఉపసభాపతి విషయంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రాజన్న దొర పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ అనూహ్యంగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో అధికారికంగా 25 మంది సభ్యుల పేర్లు వెల్లడయ్యే అవకాశం కనబడుతోంది.