నూతన సంవత్సర వేడుకలకు, దేశంలోని ప్రజలందరూ సిద్ధం అవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మాత్రం, అందుకు భిన్నంగా ఉంది. అమరావతిలో రైతులు గత 14 రోజులుగా రోడ్డు ఎక్కారు. తమ ప్రాంతం నుంచి రాజధానిని తరలించ వద్దు అంటూ, ఆందోళన చేస్తున్నారు. తమకు ప్రాణ సమానమైన భూమిని, రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చామని, తమ బిడ్డల భవిషత్తుతో పాటుగా, రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందని భావించామని, అయితే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో, తాము రోడ్డున పడ్డామని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు బయటకు రాని ఆడవాళ్ళు, చంటి పిల్లలు కూడా రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ స్థితిలోనే కొత్త సంవత్సర వేడుకులు చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితిలో, మన మధ్య తిరుగుతున్న రాజకీయ నాయకులు, ప్రజల కోసమే రాజకీయాలు చేసే పాలక పక్షం, ప్రతి పక్షం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నారని, అందుకే మేము వేడుకలకు దూరం అని తెలుగుదేశం ప్రకటించింది.
"గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యల పరిష్కారానికి బదులు వాటికన్నా పెద్ద సమస్యలు సృష్టించడం ద్వారా ప్రజలను అనేక ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. 3 రాజధానుల ప్రకటనతో రాష్ట్రం అంతటా అనిశ్చితి నెలకొంది. వేలాది రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం గతంలో లేదు. రాజధానికి వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం జరగరాదు. పనులు కోల్పోయిన రైతు కూలీలకు న్యాయం జరగాలి. మహిళల కన్నీళ్లు రాష్ట్రానికి శుభకరం కాదు. భూములు త్యాగం చేసిన రైతుల కోసం, రైతు కూలీల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఆయా కుటుంబాలకు మనం అందరం సంఘీభావంగా ఉండాలి. రోడ్లపై వేలాది కుటుంబాల ఆందోళనల దృష్ట్యా వేడుకలు చేసుకునే స్థితిలో లేము. అందుకే నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపు ఇచ్చాము. ఆ వేడుకలకు అయ్యే ఖర్చులను, బాధిత కుటుంబాల కోసం పోరాడే అమరావతి పరిరక్షణ సమితి జెఎసిలకు విరాళంగా ఇవ్వాలి. రాజధాని అమరావతి పరిరక్షణ రాష్ట్రంలో అందరి సంకల్పం కావాలి. " అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు.
ఇక జగన్ మోహన్ రెడ్డి మాత్రం, చంద్రబాబు కంటే భిన్నంగా, ఇదే అమరావతి ప్రాంతంలో, ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోనున్నారు. అధికారులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా, ఈ రోజు రాత్రికి, విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున బెరం పార్క్ లో, జగన్ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గుంటారు. ఒక పక్క కూత వేటు దూరంలో, అంటే కృష్ణా నది ఒడ్డున ఇటు జగన్ వేడుకులు చేసుకుంటుంటే, కృష్ణా నదికి అటు పక్క, అమరావతి ప్రాంత రైతులు తమ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళనలో గడపనున్నారు. మొత్తానికి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వేడుకలు రద్దు చేసుకుంటే, ప్రభుత్వంలో ఉన్న జగన్, కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గుననున్నారు.