ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన విభజన హామీలు సహా, ఇతర అంశాల పై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అంటూ, 2017 నుంచి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీ పై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రావటమే కాకుండా, ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేసారు. తరువాత మోడీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుని లోకేష్ కీ పితా అంటూ సంబోధించటం, దానికి కౌంటర్ ఇస్తూ, నేను లోకేష్ తండ్రిని అని చెప్పుకోవటానికి గర్వ పడతాను, మీ ఫ్యామిలీ గురించి ఏమిటి అంటూ చంద్రబాబు అనటం, ఇలా ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్ళాయి. తరువాత ఎన్నికల ఫలితాలు రావటం, ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోవటం ఇలా జరిగిపోయాయి. అప్పటి నుంచి మోడీ, చంద్రబాబు మధ్య మాటలు లేవు. అయితే కరోనా సమయంలో, చంద్రబాబు టీం తయారు చేసిన ఒక రిపోర్ట్ విషయంలో, చంద్రబాబు మోడీకి ఫోన్ చేయటం, తరువాత మోడీ చంద్రబాబుకి ఫోన్ చేయటం జరిగాయి. ఇక రాజకీయంగా కూడా, బీజేపీ నేతలు, అధికారంలో ఉన్న వైసిపీ కంటే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ని,, ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఉంటారు. వైసీపీ కూడా, మోడీతో సానుకూలంగా ఉన్నాట్టు సంకేతాలు ఇస్తూ వచ్చింది.
తెలుగుదేశం, బీజేపీ మధ్య ఇంత గ్యాప్ ఉన్న నేపధ్యంలో, ప్రధాని మోడి నేతృత్వంలోని అత్యున్నత కమిటీలో చంద్రబాబుకి చోటు ఇవ్వటం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, చంద్రబాబు సీనియారిటీని పరిగణలోకి తీసుకుని, ఆయన ఆలోచనలు తెలుసుకోవటానికి, ఆయన్ను ఎంపిక చేసినట్టు చెప్తున్నారు. వచ్చే ఏడాది, మన దేశానికీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, ఆ రోజుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఘనంగా నిర్వహించాలి అనే అంశం పై, సూచనలు తీసుకోనున్నారు. మొత్తం దేశంలో 259 మంది ప్రముఖులతో, ప్రధాని అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం అవుతుంది. రాష్ట్రపతి నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అన్ని రంగాల నుంచి ప్రముఖులు ఈ కమిటీలో ఉండనున్నారు. ఈ కమిటీ మొదటి సమావేశం, ఈ నెల 8 వ తేదీన జరగనుంది. అయితే ఇప్పుడు చంద్రబాబుని, ప్రధాని ఉండే కమిటీలో చోటు ఇవ్వటం పై, రాజకీయంగా చర్చ జరుగుతుంది.