వైసీపీకి తిరుగులేని విజయాలు అందించిన నెల్లూరు నుంచి ఒక్కో వైసీపీ ఎమ్మెల్యే జారుకుంటున్నారు. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన, వైసీపీ సస్పెండ్ చేసిన వారంతా జగన్ రెడ్డి సామాజికవర్గం వారే. కోటంరెడ్డి, రాంనారాయణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిల బాటలోనే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారని, పార్టీని వీడనున్నారని టాక్ నడుస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ రెడ్డికి అండగా నిలిచిన సీనియర్ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. వైసీపీ 2019లో అధికారంలోకి రావడంతో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని ఆశించిన ప్రసన్నకుమార్ రెడ్డికి నాలుగేళ్లయినా మంత్రి పదవి దక్కలేదు. దీనిపై చాలారోజులుగా వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. చివరికి తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా రావట్లేదు అని అనుచరుల దగ్గర ప్రసన్నకుమార్ రెడ్డి వాపోవడం చర్చనీయాంశం అవుతోంది. పార్టీలో కనీస గౌరవం లేదు అని అసంతృప్తితో రగిలిపోతున్న ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ మారడం తప్ప తనకు వేరే మార్గం లేదని అనుచరులకు స్పష్టం చేసినట్లు సమాచారం బయటకొచ్చింది. అయితే టిడిపిలో చేరే చాన్స్ లేదని, టిడిపిని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తిట్టినంతగా ఏ ఎమ్మెల్యే తిట్టలేదని..ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని టిడిపిలో చేరతారని విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీలో చేరే చాన్స్ ఉందని, ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన అనుచర గణం చెబుతోంది. గతంలో ఒకసారి పార్టీ మారుతున్నారని జరిగింది తప్పుడు ప్రచారం అని కోవూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వాపోయారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. వైసీపీలో వైఎస్ విజయమ్మ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని తానేనన్నారు. అంతటి సీనియర్ నాయకుడినైన తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ సారి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ మారుతారని ఆయన అనుచరులే ప్రచారం చేయడం కొసమెరుపు.
నెల్లూరు నుంచి మరో కీలక వైసీపీ ఎమ్మెల్యే జంప్ కొడుతున్నారా?
Advertisements