ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వివిధ జాతీయ పార్టీలు ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని దేవగౌడా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాద్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్, శరద్ యాదవ్ తదితరులు దీక్షకు మద్దతు పలికారు. ఏపీభవన్ వేదికగా దీక్షకు దిగారు. 23 పార్టీలు చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపాయి. ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీని వేదికపై నిలదీశారు. ఏపీ హక్కుల సాధనలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ...ఫోన్ లో చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు.
ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో ప్రధాని మోదీ చెప్పాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభా వేదికగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నాంచారు గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ దేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తాం. రఫేల్ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా.. చౌకీదార్ చోర్ అయ్యాడు. ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్ అంబానీకి దోచి పెట్టారు. మోదీని, బీజేపీని ఓడిద్దాం అంటూ రాహుల్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్టని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి హామీ ఇచ్చి అమలు చేయలేదని కేజ్రీవాల్ విమర్శించారు. మోదీపై పోరాటంలో చంద్రబాబుకు మద్దతు ఇస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
చంద్రబాబు నాయుడు లాంటి నేత ఉండటం ఏపీ ప్రజల అదృష్టమని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాము చంద్రబాబు పోరాటానికి మద్దతిస్తున్నామన్నారు. తనను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఎంతో గౌరవించారని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సమాజ్ వాదీ మొత్తం చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా.. మీతో పాటు ఉంటాం. మీరిచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. చంద్రబాబు బలహీన పడితే.. దేశ రాజకీయాలకు అంతమంచిది కాదు. చంద్రబాబులాంటి నేత కలిగి ఉన్నందుకు ఆంధ్ర ప్రజలు అదృష్టవంతులు. ఆయన బతికి ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ దీక్షకు సంఘీభావాన్ని ములాయంసింగ్ యాదవ్ తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎల్జేడీ నేత శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్రం ధర్మం తప్పడం వల్లే ఏపీ ప్రజలు ఇక్కడికి వచ్చారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తూ.. చంద్రబాబు మంచి పని చేస్తున్నారని అభినందించారు. ఆంధ్రాలో ప్రధాని మాటలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమన్నారు.