సరిగ్గా 27 రోజులు... రాజకీయ పరిస్థితులన్నీ సమూలంగా మారాయి. ప్రస్తుతం సామాన్యుడి నోట చంద్రబాబు మాటే పదేపదే వినిపిస్తోంది. నలుగురు మహిళలు ఒక చోటచేరినా.. ఏ ఇద్దరు వృద్ధులు ఎదురుపడినా వారి మాటల్లోనూ బాబు ప్రస్తావనే.. కిల్లీ కొట్టు నుంచి పొలంగట్ల వరకు సీఎం చంద్రబాబు పథకాలపైనే చర్చ జరుగుతోంది. కారణం... 27 రోజుల వ్యవధిలో ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లా పరిధిలోని 55 శాతం మంది ఓటర్లు ప్రత్యక్షంగా లబ్ధిపొందారు. ఫిబ్రవరి ఆరంభం నుంచి ఒక పథకం గురించి మరచిపోకముందే మరోవరంతో చంద్రబాబు ప్రజలను మురిపిస్తున్నారు. ఊహకందని విధంగా అధికార పార్టీకి పెరుగుతున్న అనుకూలతను చూసి, టీడీపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. కంగుతిన్న ప్రతిపక్షాలు మౌనంగా పరిస్థితిని అంచనా వేస్తున్నాయి.
జనవరి 11వ తేదీ కావలి పర్యటనలో సీఎం చంద్రబాబు సామాజిక పింఛన్లను రెట్టింపు చేస్తూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదేరోజు సీజెఎఫ్‌ఎస్ భూముల పట్టాల పంపిణీ జరిగింది. సెంటు భూమిలేని వేలాదిమంది నిరుపేదలను భూ యజమానులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటి గురించి చర్చ ముగియకముందే త్వరలో చంద్రబాబు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించనున్నారనే వార్తలు వచ్చాయి. అందరూ ఆశించిన విధంగానే ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. పెంచిన వృద్ధాప్య పింఛన్లతో పాటు పసుపు- కుంకుమ పథకం కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. 10వేల ఆర్థిక సాయం అందించే భారీ పథకానికి బాబు శ్రీకారం చుట్టారు.
ఈ తీపి జ్ఞాపకాల నుంచి తేరుకోకమునుపే 5వ తేదీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రైతు, ఉద్యోగ, నిరుద్యోగ, కార్మిక వర్గాల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి, వాటికి నిధులు కేటాయించారు. ఇలా గడచిన 27 రోజులుగా ఒకటి తరువాత మరొకటిగా వరుస సంక్షేమ పథకాలు అమలులోకి తేవడంతో మెజారిటీ వర్గాల ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎక్కడ ఏ నలుగురు గుమికూడినా చంద్రబాబు ప్రవేశపెట్టిన కొత్త పథకాల గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మొత్తం ఓటర్లలో సుమారు 55 శాతం మంది ఈ పథకాల ద్వారా ప్రత్యక్షంగా లబ్ధిపొందారు. కుటుంబాల పరంగా పరిశీలిస్తే పేద, మధ్య తరగతికి చెందిన మెజారిటీ కుటుంబాలు ఒకటి నుంచి నాలుగు రకాల లబ్ధిని పొందాయి. కొద్ది రోజుల వ్యవధిలో ఊహకందని విధంగా ఇంత భారీ సంఖ్యలో ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం కొత్త రూపు సంతరించుకుంది. కొత్త పథకాలు, వాటికి ప్రజల్లో లభిస్తున్న స్పందన గమనించిన వైరి పక్షాలు ఖంగుతిన్నాయి. అంతుపట్టని విధంగా కొత్త పథకాలు ప్రకటించడం, ఆ వెనువెంటనే వాటిని అమలు చేయడం, వీటి ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా లబ్ది పొందుతుండటంతో వీటిని ఎలా ఎదుర్కోవాలో అంతు పట్టక మౌనం దాల్చాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాయి.