రాజధాని రైతులు ఎప్పడా అని ఎదురుచూస్తున్న సింగపూర్ పర్యటన ఖరారైంది. రైతులే ప్రధమం (పార్మర్స్ ఫస్ట్) కార్యక్రమంలో భాగంగా అమరావతి రాజధానికి భూమిలిచ్చిన రైతులు సింగపూర్లో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథకాలను సందర్శించటానికి సీఆర్డీఏ అవకాశం కల్పిస్తోంది.
సింగపూర్ పర్యటనకు ఆసక్తి ఉన్న రైతులు నుంచి సీఆర్డీఏ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పర్యటనలో భాగంగా 100 మంది భూములిచ్చిన రైతులను మూడు దఫాలుగా సింగపూర్ తీసుకెళ్లడానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి జట్టును ఈ ఏడాది అక్టోబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 26 వరకు, రెండవ జట్టును నవంబర్ 5 తేదీ నుంచి నవంబర్ 9 వరకు, మూడో జట్టుని నవంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 28 తేదీలుగా ఖరారు చేశారు.
ఈ పర్యటనలో భూసమీకరణ పథకం కింద అమరావతి రాజధాని నిర్మాణం కొరకు భూములు ఇచ్చినవారు తిరిగి పొందిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఏ విధంగా అభివృద్ది పరుచుకోవచ్చనే అంశం పై అవగాహన కల్పించనున్నారు. అదే విధంగా సింగపూర్ ప్రభుత్వం అభివృద్ధి పరిచిన అనేక పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రణాళిక బద్దమైన కార్యక్రమాలను పరిశీలించటం ద్వారా అవగాహన కలిగించడానికి ఈ పర్యటన తోడ్పడుతుందని సీఆర్డీఏ భావిస్తోంది.
ఈ పర్యటనకు ఎంపికైన వారికి సింగపూర్లో 3 రాత్రులు, 4 పగళ్లు వసతి, స్థానిక రవాణా సదుపాయాలను సీఆర్డీఏ కల్పించనుంది. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్దతి ద్వారా ఎంపికచేయనున్నారు. దీనికి అర్హతగా 08.12.2014 తేదీ నాటికి రాజదానిలో భూయజమానిగా గుర్తించబడి నివాసం కలిగి ఉండాలి. అదే విధంగా భూసమీకరణ పథకం కింద రాజధాని నిర్మాణానికి భూమిలిచ్చి 9.14 అగ్రిమెంట్ పొందిన వారైవుండాలి. భారత ప్రభుత్వం జారీచేసిన పాస్ పోర్ట్ కలిగి ఉండాలి.
పర్యటనకు ఎంపికైన వారు రాను పోను విమానయాన టికెట్ ఖర్చులు, వీసా ఫీజు, ఆరోగ్య బీమా రైతులే భరించవలసి ఉంటుంది. సింగపూర్ పర్యటనకు ఆసక్తి ఉన్నవారు రాజధాని గ్రామాలలో ఉన్న కాంపిటెంట్ అధారిటీల వద్ద నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవచ్చుని, నమూన ఫారాలను కాంపిటెంట్ అధారిటీల వారి కార్యాలయంలో ఉంటాయని సీఆర్డీఏ తెలిపింది.