ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఇవాళ రానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోదీ వ్యతిరేక పోస్టర్లు వెలిసాయి. ఆగ్రహం కట్టెలు తెంచుకున్నట్టుగా జనవాహిని తరలి వస్తుండగా మోదీ పరుగు పెడుతున్నట్టు ఆ పోస్టర్లలో చిత్రీకరించారు. 'నో మోర్ మోదీ' 'మోదీ ఈజ్ మిస్టేక్', 'మోదీ నెవర్ ఎగైన్' అనే స్లోగన్‌లు ఆ పోస్టర్లలో చోటుచేసుకున్నాయి. ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది నిర్ధారణ కాలేదు. మోదీ గో బ్యాక్ అంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో మహిళలు రోడ్డెక్కారు. జడ్పీటీసీ శైలజారాణి ఆధ్వర్యంలో మహిళలు, టీడీపీ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి కాలీ కుండలు, నీళ్లతో నిరసనలు తెలిపారు. మోదీ ఏపీ పర్యటనపై టీడీపీ, కాంగ్రెస్‌తోపాటు కొన్ని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
ఏపీకి అన్యాయం చేసి రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి. మోదీ రాకకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. పలు చోట్ల మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసనలు తెలిపారు. నల్లబ్యాడ్జీలు, కండువాలు ధరించిన నిరసనకారులు ఆందోళన నిర్వహించారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయలేదంటూ తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు మండిపడుతున్నారు. చంద్రబాబు సూచనలతో కాలీ కుండలను పగులగొడుతున్నారు. మరోవైపు సినీ నటుడు శివాజీ విజయవాడ కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. మోదీ ఏపీకి వచ్చి తిరిగి వెళ్లేంతవరకు తాను నీటిలో ఉండి నిరసన తెలుపుతానని అన్నారు. ప్రధాని రాక సందర్భంగా గాంధేయవాద తరహాలో నిరసనలు తెలపాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఇప్పటికే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ 'ఈ ఆదివారం చీకటి దినం. ఆంధ్రప్రదేశ్‌కు స్యయంగా చేసిన అన్యాయాన్ని కళ్లారా వీక్షించేందుకు ప్రధాని వస్తున్నారు. రాష్ట్రాన్ని, రాజ్యంగ సంస్థలను మోదీ బలహీనపరిచారు. దేశాన్ని అగౌరవపరుస్తూ రాఫెల్ డీల్‌లో పీఎంఓ జోక్యం చేసుకుంది. మనమంతా పసుపు, నలుపు షర్టులు, బెలూన్లతో గాంధేయవాద పంథాలో శాంతియుతంగా నిరసనలు తెలుపుదాం' అని చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గుంటూరు సిటీ సమీపంలోని ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద 'ప్రజా చైతన్య సభ' పేరుతో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ఇవాళ ప్రసంగించనున్నారు. తన పర్యటనలో భాగంగా 1.33 ఎంఎంటీ విశాఖఫట్నం స్ట్రాటజిక్ పెట్రోలియం రిసర్స్ (ఎస్‌పీఆర్) ఫెసిలిటీని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఓఎన్‌జీసీ వశిష్ట అండ్ ఎస్1 డవలప్‌మెంట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కృష్ణపట్నంలో బీపీసీఎల్ కొత్త టెర్మినల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు.