జలవనరుల సంరక్షణతో ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 400 కోట్ల విలువైన విద్యుత్ ఆదా చేశామని, ఇదే స్ఫూర్తితో సమర్థ నీటి నిర్వహణ పనులను వచ్చే నెల నుంచి 116 రోజుల పాటు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భూగర్భజలాలు పెంచగలగడం ద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగంలో మిగులు సాధించడం ప్రభుత్వ విజయంగా అభివర్ణించిన ముఖ్యమంత్రి ‘నీరు-ప్రగతి’ కింద కాలువలు, చెరువులు పటిష్ట పరచడంతో పాటు చెక్‌డ్యాంలకు మరమ్మతులు వంటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్దేశించారు. నీటి నిర్వహణ కమిటీలను తక్షణం నియమించి ఈ పనుల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించాలని చెప్పారు. 116 రోజుల లక్ష్యం పూర్తి అయిన వెంటనే జూన్‌లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని తలపెట్టిన 28 ప్రాధాన్య ప్రాజెక్టులలో ఇప్పటికే ఏడింటిని ప్రారంభించగా మరో 6 ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా వున్నాయి. పోగొండ రిజర్వాయర్, పెదపాలెం ఎత్తిపోతల పథకం, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, జీఎన్‌ఎస్‌ఎస్ మొదటి ధశలో భాగమైన అవుకు టన్నెల్, పులికనుమ ఎత్తిపోతల పథకం, చినసాన ఎత్తిపోతల పథకం పూర్తయ్యాయి. మిగిలిన 15 ప్రాజెక్టు పనులు ఎంతవరకు పురోగతి సాధించాయో అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశలో భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం పూర్తిచేసి మార్చి 15 కల్లా కుప్పానికి నీరు తరలించాలని సూచించారు.
చిత్తూరుకు నీరందించేలా ఏప్రిల్ 15 కల్లా అడవిపల్లి రిజర్వాయర్ సిద్ధం చేయాలని చెప్పారు. మార్చి నాటికి కొండవీటి వాగుకు 5 పంపులు బిగిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాజధాని అమరావతి భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా కృష్ణానదిపై వైకుంఠాపురం దగ్గర బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) ఫిబ్రవరి 5 కల్లా అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్‌కు 23 కి.మీ. ఎగువున, పులిచింతల ప్రాజెక్టుకు 60 కి.మీ. దిగువున వైకుంఠాపురం బ్యారేజ్ నిర్మాణం కానుంది. మొత్తం బ్యారేజ్ పొడవు 3.068 కి.మీ. వుంటుంది.