ప్రకాశం బ్యారేజీ నిర్మించి 60 ఏళ్లయిన సందర్భంగా విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు... ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇవాళ ఉన్న పరిస్థుతుల్లో పట్టిసీమ నిర్మించుకుని ఉండకపోతే ఈ రోజు ఇక్కడ ఇలా ఘనంగా కార్యక్రమం చేసుకునే పరిస్థితి ఉండేది కాదని, ఇక్కడ నిలబడితే జనం రాళ్లు వేసే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలు పై నుంచి తగ్గిపోయిన నేపధ్యంలో అక్టోబర్ చివరి దాకా నీళ్ళు రాలేదు అని, కాని మనం పట్టిసీమతో జూన్ నుంచే నీళ్ళు ఇచ్చామని, రికార్డు పంట పండింది అని, అటు రాయలసీమ, ఇటు కృష్ణా జిల్లాకి కూడా సరిపడా నీళ్ళు ఇచ్చామని అని అన్నారు...
ఎక్కడ నీళ్లుంటే అక్కడ ప్రాజెక్టులు కట్టుకోవడమే ముఖ్యమని, సాధ్యత ఉందా లేదా అనుకుంటే కుదరదని చంద్రబాబు అన్నారు...ఎన్ని అడ్డంకులు వచ్చినా పోలవరం పూర్తి చేసి తీరతానిని చెప్పారు.. కేంద్రం బిల్లులు సకాలంలో చెల్లిస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. 2018 నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నా. కాంక్రీటు పనులు వేగం పుంజుకోవాల్సి ఉంద’ని ముఖ్యమంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సమాచారమూ రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. స్పిల్వే, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు మిగిలిపోయాయని చెప్పారు.
నాడు ప్రకాశం బ్యారేజీ నిర్మాణ పనుల్లో భాగస్వాములైన సిబ్బందిని సన్మానించారు. గోదావరి, ప్రకాశం ఆనకట్ట, బ్యారేజీల నిర్మాణం, కాటన్దొర, ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, ఓర్ తదితరుల పాత్రను, చరిత్రను స్మరించుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక నాడే కర్నూలు కాకుండా విజయవాడ రాజధాని అయి ఉంటే ఇప్పటికే రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండేదని వ్యాఖ్యానించారు. నాడు ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ఆర్థిక మంత్రి తెన్నేటి విశ్వనాథాన్ని ప్రకాశం బ్యారేజీ నిర్మాణ నిధుల కోసం ప్రణాళికాసంఘం వద్దకు పంపితే కేంద్ర సహకారం లభించలేదని అన్నారు. సొంత నిధులతోనే నిర్మించుకుందామని ప్రకాశం పంతులు పని ప్రారంభించారని వివరించారు.