టీడీపీ నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జనసేన విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేసిన గేదెల శ్రీనివాస్ (శీనుబాబు) ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. హైదరాబాద్ కేంద్రంగా వచ్చిన ఒత్తిళ్లే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం దాకా ప్రచారం చేసిన ఆదాల.. ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లి, లోట్‌సపాండ్‌లో ప్రత్యక్షమయ్యారు. మంత్రి సోమిరెడ్డి వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందన్న ఆ దాల ఆరోపణను ఎవ్వరూ నమ్మడంలేదు. అదే నిజమైతే, సోమిరెడ్డితో తన విభేదాల గురించి చంద్రబాబుకు ఎందుకు చెప్పలేదు? సమస్య పరిష్కరించాలని కోరి, పట్టించుకోకపోతే పార్టీ మారాలి. కానీ... ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. తెల్లవారేసరికి లోట్‌సపాండ్‌లో తేలారు’ అని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇదంతా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన పన్నాగమేనని అంటున్నారు. రాజకీయేతర కారణాలతో తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగానే వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు లోక్‌సభ బరిలో దిగుతున్నారని చెబుతున్నారు. ‘లోక్‌సభకు పోటీచేసేది లేదని టీడీపీలో ఉండగా ఆదాల పలుమార్లు చెప్పారు. హైదరాబాద్‌లో జగన్‌ను కలిసి వచ్చాక.. ఎంచక్కా తల ఊపుతూ ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరించారు. దీనివెనుక ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం’ అని టీడీపీ నేత ఒకరు తెలిపారు.
‘తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్రంలోని మనవాళ్ల ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారు. వైసీపీకి సరెండర్ కమ్మని వేధిస్తున్నారు. ఏమనుకుంటున్నారు వీళ్లు..? ఇది రాజకీయమా..? ఇదా నీతి? ఇది ధర్మమా..? దీనికి సమాధానం చెప్పకుండా మాపై దాడులు చేయిస్తున్నారు. ఈ దాడులు మరింత పెంచే అవకాశం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళవారం కడప, అనంతపురం, కర్నూలుల్లో జరిగిన ఆయా జిల్లాల టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో సీఎం ప్రసంగించారు. ‘జగన్‌పై పన్నెండు కేసులు ఉన్నాయి. హిందూజాకు 100 ఎకరాలు అనుమతి కావాలంటే 11 ఎకరాలు జగన్ ఇవ్వాలని అడిగారు. ఆ భూమికి హిందూజానే డబ్బు ఇచ్చింది. ఇందుకోసం ఓ బోగస్ కమిటీని పెట్టి.. షెల్ కంపెనీలకు డబ్బు పంపి, ఆ డబ్బును తిరిగి వీళ్ల కంపెనీకి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్లీ హిందూజాకు ఇచ్చి 11 ఎకరాల భూమి కొనేశారు. నేను చెబుతున్నది కాదు ఇది.. ఈడీ సీబీఐకి లేఖ రాసింది.. వీళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసీఆర్, మోదీ, జగన్ ముగ్గురు ఒక్కటై మనపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ దుష్టశక్తులపై పోరాటం చేసేందుకు ప్రజలంతా ఏకం కావాలి. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య ఇది’ అని పేర్కొన్నారు. నేను మంచికి మంచి.. ‘నేను మంచికి మంచి వాడిని.. చెడ్డకు చెడ్డ వాడిని.
తెలంగాణ ముఖ్యమంత్రి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట. మావద్ద కూడా వారికివ్వడానికి పది సిద్ధంగా ఉన్నాయ్. రెడీగా ఉండండి. తమాషాగా ఉందా? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇల్లూ మా ఇంటికి అంతే దూరం.. కేసీఆర్ చేసేదంతా చేస్తూ ఏపీ ఎన్నికలతో తనకు సంబంధం లేదంటున్నారు. డబ్బు పంపడం.. జగన్‌ను సంకలో వేసుకోవడం వంటివి సంబంధం లేని విషయాలా? కేసీఆర్ ఇక్కడ పెత్తనం చెలాయించాలని దొడ్డిదారిని ఎంచుకున్నారు. జగన్ ద్వారా పావులు కదుపుతూ పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునే పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు కట్టడానికి వీలులేదని ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ వేశారు. ఆ ప్రాజెక్టు వల్ల మీకు నష్టమేమిటి.. సముద్రంలోకి వెళ్లే నీళ్లు మేము వాడుకుంటే మీకేంటి బాధ? ఆ రోజు నేను గెలిచిన వెంటనే సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రం ఇంకా విడిపోలేదు.. నోటిఫికేషన్ ఇవ్వలేదు.. తెలంగాణలో ఉన్న ఏడు మండలాలు ఇవ్వకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనన్నాను. ఆ రోజు ఆ ఏడు మండలాలు రాబట్టక పోయి ఉంటే పోలవరానికి ఎన్నో అడ్డంకులు పెట్టేవాళ్లు. కేంద్రం సహకరించలేదు. తెలంగాణ ప్రభుత్వం వేరే ప్రభుత్వాలను రెచ్చగొడుతోంది. అయినా వెనక్కిపోలేదు. 68 శాతం పనులు పూర్తి చేశాం. జూలై నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తాం.. డిసెంబరుకు పోలవరం పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు.