నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ స్థానానికి టీడీపీ అభ్యర్థిత్వం సాధించిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి హఠాత్తుగా అదృశ్యమయ్యారు. 15 ఏళ్లుగా రాష్ట్రప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నిటినీ మంజూరు చేయించుకుని.. అవి బ్యాంకు లో డిపాజిట్ అయిన మరుక్షణమే పత్తాలేకుండా పోయారు. వైసీపీలో చేరి నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో తెలుగుదేశం అధిష్ఠానం బిత్తరపోయింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం అర్ధరాత్రి వరకు ఆదాల అమరావతిలోనే ఉన్నారు. టీడీపీ టికెట్ సాధించడంతో పాటు బిల్లులన్నిటినీ క్లియర్ చేసుకున్నారు. సుమారు రూ.43 కోట్లకు క్లియరెన్స్ వచ్చింది. ఆ పని పూర్తికాగానే ఆదాల నెల్లూరు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు.
సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రూ.43 కోట్లు కంపెనీ ఖాతా లో జమయ్యాయని మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. దానిని చూసిన వెంటనే ప్రచారం ముగించారు. అర్జెంట్‌గా అమరావతికి రమ్మంటున్నారంటూ బయల్దేరారు. అంతే.. ఆ తర్వాత కనిపించలేదు. టీడీపీ నేతలు ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. ఆదాల పార్టీ ఫిరాయించారని, వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం వైసీపీ వర్గాల నుంచే మొదలైంది. కంగారుపడిన టీడీపీ నేతలు ఆయన కోసం ప్రయత్నించారు. అందుబాటులోకి రాలేదు. ఈలో పు ఆయన అనుచరులు ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఆదాల పార్టీని మోసగించారని టీడీపీ నేతలకు అర్థమైంది.
600 కోట్ల పనులు కైవసం.. ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారినప్పుడు వలసలు పెరుగుతాయని టీడీపీ నాయకత్వం ఒకింత కలవరపడింది. ఆ సమయంలోనే ఆదాల కూ డా వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇలా తానే ప్రచారం సృష్టించి అధిష్ఠానంపై ఒత్తిడి పెంచి.. తాను పార్టీ మారకుండా ఉండేందుకు రూ.600 కోట్ల విలువైన సోమశిల హైలెవల్ కెనాల్ పనులు దక్కించుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదాల కదలికలపై అనుమానం వచ్చిన కొందరు నాయకులు ఈ సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు చేరవేశారు. దీంతో ఆదాల ముఖ్యమంత్రిని కలిసి టీడీపీతోనే ఉంటానని నమ్మబలికారు. దాంతో సీఎం ఆయన మాటకు విలువిచ్చారు. ఎన్నికల సమావేశాల సందర్భంగా.. టీడీపీ తరపున లోక్‌సభకు పోటీచేయాలని సీఎం ప్రతిపాదించినప్పుడు ఆదాల ససేమిరా అన్నారు. నెల్లూరు రూరల్ కోసం పట్టుబట్టారు. తీరా ఇప్పుడు టికెట్ ఇచ్చాక కనిపించకుండా పోయారు.