తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘డేటా చోరీ’ కేసులో ఆధార్ (యూఐడీఏఐ) సంస్థ కీలక ప్రకటన చేసింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ తమ సర్వర్ల నుంచి అక్రమంగా, చట్టవిరుద్ధంగా డేటాను చోరీ చేయలేదని స్పష్టం చేసింది. తమకు సంబంధించిన కేంద్రీకృత సమాచార నిల్వ కేంద్రం (సీఐడీఆర్)తోపాటు సర్వర్లు అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. బుధవారం దీనిపై యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆధార్ చట్టానికి విరుద్ధంగా ఐటీ గ్రిడ్స్ సంస్థ పెద్ద సంఖ్యలో పౌరుల ఆధార్ వివరాలను సేకరించినట్లు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా మేం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాం.
అయితే... పౌరుల ఆధార్ సంఖ్య, పేరు, చిరునామా తదితర వివరాలను యూఐడీఏఐ సర్వర్ల నుంచి చోరీ చేసినట్లుగా ఆధారాలు లభించినట్లు సిట్ నివేదికలో ఎక్కడా లేదు. పలు సర్వీస్ ప్రొవైడర్లు వ్యక్తుల నుంచి నేరుగా వారి ఆధార్, ఇతర వివరాలు సేకరించడం సాధారణంగా జరిగేదే. అయితే... ఈ సమాచారాన్ని నిర్దిష్టంగా ఏ అవసరం కోసం సేకరించారో, దానికోసమే ఉపయోగించాలి. సదరు వ్యక్తి సమ్మతం లేకుండా ఈ సమాచారాన్ని ఇతరులకు అందించకూడదు. ఆధార్ చట్టానికి వ్యతిరేకంగా ఆ సమాచారాన్ని సేకరించినా, నిల్వ చేసినా, ఉపయోగించినా, అందుకు బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చు’’ అని యూఐడీఏఐ ప్రకటించింది.
అదేసమయంలో... కేవలం ఆధార్ సంఖ్య, పేరు, వివరాలు తెలుసుకున్నంత మాత్రాన పౌరులకు ఎలాంటి నష్టం జరగదని... బయోమెట్రిక్ లేదా వన్‌టైమ్ పాస్‌వర్డ్ వంటి రెండో అంచె భద్రత ఉంటుందని తెలిపింది. ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించి తమ సర్వర్లతో, సమాచారంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అయితే... ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆధార్ సమాచారాన్ని ఏ అవసరం కోసం సేకరించింది, చట్ట ఉల్లంఘన జరిగిందా అనే విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించింది.