సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఆయన వైసీపీ అధినేత జగన్ కు రాజీనామా లేఖ పంపారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆదిశేషగిరిరావు... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్నుమూసిన తర్వాత వైసీపీలో చేరారు... చాలా కాలం వైసీపీలో యాక్టివ్‌గా పనిచేసిన ఆయన... కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక పార్టీని వీడుతున్నట్టు జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు ఆదిశేషగిరిరావు. వైసీపీ నుంచి తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి ఆదిశేషగిరిరావు భావించగా... విజయవాడ లోక్‌సభ సీటు నుంచి పోటీచేయాలని, దానికి భారీగా డబ్బు ఖర్చు పెట్టాలని వైసీపీ అధినేత సూచించినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు... పార్టీకి గుడ్‌బై చెప్పారు.
మరోవైపు ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతున్న సమయంలో, ఆయన ఈ రోజు చంద్రబాబుని కలిసారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నానని హీరో కృష్ణ సోదరుడు, మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రకటించారు. చంద్రబాబును కలిసి దాదాపు అరగంటకు పైగా చర్చించిన ఆయన, తన రాజకీయ భవిష్యత్ పై హామీ తీసుకున్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుతో బయటకు వచ్చిన అనంతరం ఆదిశేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ, కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘాలతో చర్చించిన తరువాతే, వైసీపీని వీడానని, త్వరలో టీడీపీలో చేరుతానని అన్నారు.
అన్ని అంశాలపై తమ బంధువులు, కార్యకర్తలతో చర్చించటానికి, ఆయన రెడీ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చెరక పై, చంద్రబాబు ఇచ్చిన హామీ పై వారితో చర్చించి, తగు నిర్ణయం తీసుకోనునట్టు తెలుస్తుంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు ఉండేది, ఆయన పార్టీలో ఎప్పుడు చేరేది, ఇంకా ప్రకటించలేదు. కాగా, ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయునిగా, కాంగ్రెస్ పార్టీ నేతగా ఒకప్పుడు నిలిచిన హీరో కృష్ణ క్రియాశీల రాజకీయాలకు చానాళ్లుగా దూరంగా ఉంటుండగా, మహేశ్ బాబు, 2014 ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా నిలబడిన తన బావ గల్లా జయదేవ్ ను గెలిపించాలని ఫ్యాన్స్ కు పిలుపునివ్వడం మినహా, మరెక్కడా రాజకీయాల్లో కనిపించలేదు.