ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు జగన్ ను కలవకపోవటం, మరో పక్క కాంగ్రెస్ కూడా ఆనం రామనారాయణరెడ్డిని ఆహ్వానించటంతో, ఆయన కన్ఫ్యూషన్ లో ఉన్నారు అని అందరూ అనుకున్నారు. కాని, వీటన్నటికీ తెర దించుతూ, ఆనం, జగన్ ను కలిసారు. శుక్రవారం కోర్ట్ కు వెళ్లి తిరిగి వస్తూ, సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ విమానాశ్రయంలో జగన్తో భేటీ అయ్యారు. ఇద్దరు సుమారు 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. అయితే ఆనం కోరిక మేరకు ఆత్మకూరు టిక్కెట్టు దక్కుతుందా, లేక మరే నియోజకవర్గానికైనా మారాల్సి వస్తుందా అనే విషయం మాత్రం అస్పష్టంగానే ఉంది. ఆనం మాత్రం ఆత్మకూరు టిక్కెట్టు కోసమే, తెలుగుదేశం పార్టీ వీడుతున్నారు.
అయితే, ఆయన ఈ రోజు (జూలై 8న ) వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కాని, ఈ రోజు ఆయన చేరలేదు. దీంతో మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి. అయితే, జగన్ ఆనం కలిసిన విషయం తెలుసుకున్న నెల్లూరు వైసిపీ నేతలు మాత్రం, జగన్ పై కోపంగా ఉన్నారు. ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, మేకపాటి కుటుంబం జగన్ పై ఫైర్ అయ్యారు. ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి తానే పోటీ చేస్తున్నానని, ఇందులో ఏ మాత్రం అనుమానం లేదని స్పష్టం చేశారు.
తొమ్మిదేళ్లు పార్టీకి కష్టపడిన వారిని కాదని నిన్న, మొన్న పార్టీలోకి వచ్చే వారికి టిక్కెట్టు ఇచ్చే సంస్కృతి వైసీపీలో లేదన్నారు. సిద్ధాంతాలు నచ్చి పార్టీకి పనిచేస్తామని వచ్చే వారిని కాదనేది లేదని, అయితే నిబంధనలతో పార్టీలోకి రావాలంటే అంగీకరించే ప్రశ్నే లేదని గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గౌతంరెడ్డి సమ్మతి లేకుండా ఆత్మకూరు టిక్కెట్టు మరొకరికి ఇస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, క్యాడర్ కూడా అంటుంది. జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నచ్చజెప్పితే సాధ్యమవుతుంది కాని, తానే పోటీ చేయబోతున్నట్లు గౌతంరెడ్డి బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో జగన్ కూడా ఆయనపై ఒత్తిడి చేసే అవకాశం ఉండదు. ఈ క్రమంలో ఆనం రామనారాయణరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఆత్మకూరు కాకుండా మరో చోట పోటీ చేయడానికి ఆయన సమ్మతిస్తారా.. అనే కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.