సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణక గత కొన్ని రోజులుగా జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న శనివారంతో ఈ పర్యటనలు ముగిసాయి. ఈ నేపధ్యంలో, జాతీయ పార్టీ ఆప్ నుంచి ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యంత పారదర్శకమైన పాలనను అందిస్తున్న ఆప్ లోకి రావాలంటూ ఆ పార్టీ నేతలు ఆయనను ఆహ్వానించారు. ఆప్ లో చేరి అవినీతి రహిత పాలనను అందించడానికి లక్ష్మీనారాయణ కృషి చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకటరామారావు కోరారు. నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ప్రజల సమస్యలను లక్ష్మీనారాయణ తెలుసుకున్నారని చెప్పారు.
విద్యార్థులు, రైతులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తాము నిశితంగా పరిశీలించామని, మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తానని ఆయన చెప్పిన మాట ఆధారంగా ఆయనను ఆప్ లోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇది ఇలా ఉంటే, దేశ, రాష్ట్ర పరిస్థితులను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. త్వరలో ఎన్నికలు రానున్నాయని, సేవ చేసే నాయకులనే ఎన్నుకోవాలని.. డబ్బు పంచే వారు అవసరం లేదని పేర్కొన్నారు. ఆదివారం అనంతపురంలో షిర్డీ సాయిబాబా దేవాలయం సేవా సంఘం ఆధ్వర్యంలో పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
గత ఐదు నెలల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించానని లక్ష్మీనారాయణ చెప్పారు. రైతులు, నేతన్నలు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులను కలిసి వారి సాదకబాధకాలు తెలుసుకున్నానన్నారు. కరవు సీమ అనంతపురం జిల్లా రైతుల కష్టాలు తనను కలచివేశాయని పేర్కొన్నారు. వారి ఆశలు, ఆకాంక్షలు, వేదనను ప్రతిబింబించేలా అనంత నుంచి వ్యవసాయ డాక్యుమెంటరీ రూపొందిస్తానని తెలిపారు. మానవత్వమే మనిషి కులం అని, మంచి మనసుతో మనసులను, మనుషులను కలిపినప్పుడే సమానత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు.