మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, ఏబీ వెంకటేశ్వరరావుని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వెంటనే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఏమి తేల్చకుండా, ఉండటంతో, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఆయన పై విచారణ చేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని కోరటంతో, సెక్రటేరియట్ లోని, కమిషనరాఫ్ ఎంక్వైరీస్ వద్ద హాజరైన ఏబీ వెంకటేశ్వరరావు గత 14 రోజులుగా విచారణ ఎదుర్కుంటున్నారు. ఈ రోజుతో ఆయన విచారణ ముగిసింది. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్ వి-వే-క తనకు మంచి మిత్రుడుని, ఆయన ప్రమాదవసాత్తు చనిపోయారనేది ఎంత నిజమో, ఎలా నమ్మించారో, తన పై ఆరోపణలు కూడా అంతే నిజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక పక్క వివేక కుమార్తె, ఢిల్లీలో సంచలన ప్రెస్ మీట్ పెట్టి, ఇక్కడ ఉన్న కొంత మంది అనుమనాలు వ్యక్తం చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని చెప్పిన తరువాత, ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అప్పట్లో వివేక ఘటన జరిగిన సమయంలో, ఏబివి ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే ఎంక్వయిరీ ముందుకు వెళ్లి, అరెస్ట్ లు జరుగుతాయనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే, ఆయనను అప్పటి ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ఏబీ వెంకటేశ్వరరావు మరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. అల్పులు, అధములు, కుక్కమూతి పిందెలు, చట్టాలు తెలియని వాళ్లు తన పై ఆరోపణలు చేసారని, అలాగే తనకు వ్యతిరేకంగా కొన్ని కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారని, ఈ ఆధారాలు అన్నీ విచారణ అధికారికి ఇచ్చానని అన్నారు. తన పై ఆరోపణలే కుట్ర ప్రకారం చేసినప్పుడు, ఈ డాక్యుమెంట్ లు సృష్టించటంలో ఆశ్చర్యం ఏమి లేదని అన్నారు. ఆ కృత్రిమ డాక్యుమెంట్ లు సృష్టించిన వారి పై, దీని తరువాత , న్యాయ పరంగా వాటి సంగతి తేలుస్తానని అన్నారు. ఇక విచారణ గురించి మాట్లాడుతూ, తానే 21 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేశానని అన్నారు. తనకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాసం ఇచ్చిన, సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ దేశంలోనే 14 రోజులు పాటు, ఒక అధికారిని విచారణ చేయటం, నాదేనేమో అన్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, భావోద్వేగానికి గురయ్యారు. తనను ఇన్నాళ్ళు వేధించారు అనే బాధ ఆయనలో కనిపించింది.