భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను పాక్.. భారత్‌కు అప్పగించింది. లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో అభినందన్‌ను పాక్ అధికారులు తీసుకువచ్చారు. సరిహద్దు వద్ద ఆయనకు భారత వాయు సేన ఘన స్వాగతం పలికింది. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించింది. అక్కడి నుంచి అభినందన్‌ను నేరుగా దిల్లీ తీసుకెళ్లి అక్కడ పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయనున్నారు. తొలుత సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో భారత అధికారులకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇమిగ్రేషన్ పక్రియ కారణంగా అప్పగింత ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అభినందన్‌ను పాక్ అప్పగించింది.
అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్ సురక్షితంగా భారత్ చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. సరిహద్దుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శత్రువు చెరలో చిక్కినా స్థైర్యం కోల్పోలేదని అభినందన్‌ను యావత్ భారతావని కొనియాడుతోంది. అభినందన్‌కు స్వాగతం పలికేందుకు సరిహద్దు వద్దకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా జై హింద్, భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగుతోంది. నిబంధనల ప్రకారం అతడు భారత్‌కు రాగానే విచారణ చేయనున్నారు. అటారీ చేరుకున్న అభినందన్‌ను భారత వైమానిక దళానికి చెందిన ఇంటెలిజెన్స్ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఫిట్నెస్ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు. అనంతరం ఆయన శరీరంలో పాక్ ఆర్మీ ఏమైనా బగ్‌ను అమర్చిందా? అనేది తెలుసుకునేందుకు స్కానింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
అంతేకాదు.. ఆయన మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో పరీక్షిస్తారు. అభినందన్ నుంచి సమాచారం రాబట్టేందుకు శత్రుదేశం అతడిని టార్చర్ చేసిందా? అనే విషయానికి సంబంధించి వివరాలను సేకరిస్తారు. ఇంకా ఏదైనా అవసరం అనిపిస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) అధికారులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సాధారణంగా ఐఏఎఫ్ అధికారిని ఐబీ, రా అధికారులు విచారించేందుకు అనుమతి లేదు. కానీ, క్లిష్టమైన కొన్ని కేసుల్లోనే ఈ విధంగా విచారణ చేయాల్సి ఉంటుంది. భారత్‌కు చెందిన వింగ్ కమాండర్‌ను పాక్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శాంతికి సంకేతంగా ఆయన్ను భారత్‌కు అప్పగించనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిన్న పార్లమెంట్లో ప్రకటించారు.