మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మల్యేగా ఉన్న అచ్చెన్నాయుడును ఈ రోజు ఉదయం ఏసీబీ అదుపులోకి తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉన్న అచ్చెన్నాయుడు నివాసంలో, ఏసిబి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆయన్ను శ్రీకాకుళం నుంచి విజయవాడ తరలిస్తున్నారు. దాదాపుగా 100 మంది పోలీసులతో, ఈ రోజు ఉదయమే అచ్చెన్నాయుడు ఇంటికి చేరుకున్న ఏసిబీ ముందుగా ఆయన ఇంట్లో సోదాలు జరిపి, అచ్చెన్నాయుడుని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో, అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారు అంటూ, గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ కేసు విషయమై, ఇప్పటికే కొంతమంది అధికారులను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అయితే ఇది వరుకే ఈ విషయం పై, ఆరోపణలు వచ్చిన సమయంలోనే, అచ్చెన్నాయుడు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని, పక్క రాష్ట్రాల్లో ఎలా ఇచ్చారో, ఇక్కడ కూడా ఇలాగే చెయ్యండి అని రాసిన లేఖను కూడా అచ్చెన్నాయుడు బయట పెట్టి, దీంట్లో ఏమి స్కాం జరగలేదని చెప్పారు.
కాని ప్రభుత్వం మాత్రం, మరొక రకంగా ఆలోచించింది. ఏ కారణాల చేత అదుపులోకి తీసుకున్నారు అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. జగన్ మోహన్ రెడ్డి పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నారని, ఆయన కక్ష సాధింపు రాజకీయాలు అధికం అయ్యాయని, దీనికి ఇదే నిదర్సనం అని, తమ ప్రభుత్వ వైఫల్యాలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్న సమయంలో, రోజుకి ఒక స్కాం బయట పడుతున్న సమయంలో, కోర్టులు ఈడ్చి ఈడ్చి కొడుతున్న సమయంలో, ఇవన్నీ పక్కదోవ పట్టించటానికి, ఇలా చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది. మరో వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న సమయంలో, జగన్ మోహన్ రెడ్డి అండ్ కో కి, ఒక్కడే సమాధానం చెప్పకలిగిన అచ్చెన్నాయుడుని కావాలనే అదుపులోకి తీసుకున్నారని, ఇలాంటివి తెలుగుదేశం పార్టీ చాలా చూసింది అని, అన్నీ చట్ట ప్రకారం ఎదుర్కుంటాం అంటూ, తెలుగుదేశం సమాధానం చెప్తుంది.