అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఆయన్ను తప్పించాలని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆయన్ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు ఎన్నికల విధులతో సంబంధంలేని పోస్టింగ్ ఇవ్వాలని ఈసీ సూచించింది. అయితే రెండు వారాలుగా ఆయన పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయన పోస్టింగ్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోట్ పంపారు.
ఏసీబీ డీజీగా నియమించాలని చంద్రబాబు సూచించడంతో ఆ నోట్‌ను ఈసీకి ఎల్వీ పంపారు. ఏసీబీ డీజీ పోస్టు ఎన్నికల విధులతో సంబంధం లేనిది కావడం.. రాష్ట్రంలో పోలింగ్ ముగినందున ఈసీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. దీంతో వెయిటింగ్‌లో ఉన్న వెంకటేశ్వరరావుకు ఏసీబీ బాధ్యతలు అప్పగిస్తూ ఎల్వీ జీవో విడుదల చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని అందులో పేర్కొన్నారు. రెండేళ్లకుపైగా ఏసీబీ డీజీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్ గత ఏడాది జూన్ 30న రాష్ట్ర పోలీసు దళాల అధిపతి(డీజీపీ)గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఏసీబీకి కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు తప్ప అదనపు బాధ్యతలు డీజీపీకి ఉండకూడదు. ఆ కారణంగా పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఆ బాధ్యతలను ఈసీ సూచనల మేరకు ప్రభుత్వం తాత్కాలికంగా శంకబ్రత బాగ్చీకి అప్పగించింది. ఇప్పుడు వెంకటేశ్వరరావును పూర్తిస్థాయి ఏసీబీ డీజీగా నియమించింది. అయితే ఠాకూర్ వెళ్ళిన దగ్గర నుంచి, ఏసిబిలో కొంత మంది ఉద్యోగుల వ్యవహార శైలి పై విమర్శలు వస్తున్నాయి. మొన్నటి మొన్న, ఏసిబిలో ఉన్న ఒక అధికారి జగన్ కు సన్నిహితంగా ఉంటున్నారని, ఆయనే సియం అంటూ హడావిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు ఎంటర్ అవ్వటంతో, జగన్ బ్యాచ్ అంతా అలెర్ట్ అయ్యింది.