ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడం కేవలం ఏసీబీ వల్లే కాదనీ, దానికి ప్రజల నుంచి సహకారం కూడా అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఏసీబీ బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. అవినీతిపై ప్రజలు నేరుగానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారని వెంకటేశ్వరరావు చెప్పారు. ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు తప్పు చేసినా, మేము వదిలిపెట్టం అంటూ, వార్నింగ్ ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును పదవి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిన విషయం విదితమే. అయితే తాజాగా ఏసీబీ డీజీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఉత్తర్వుల మేరకు జీవో నెంబర్ 882ను ఈ సందర్భంగా సీఎస్ విడుదల చేశారు. ఎన్నికలు పూర్తవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీని హెడ్ క్వార్టర్స్‌కు ఎన్నికల కమిషన్ అటాచ్ చేసింది. 1989 సంవత్సరానికి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఎన్నికలకు మందు వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన విధులు నిర్వహించారు.