బినామీ ఆస్తుల కేసులో, గత రెండు సార్లు నుంచి కుంటి సాకులతో తప్పించుకుంటున్న జగన్ ప్రియ శిష్యుడు, 12 ఓట్లతో గెలిచిన వైసిపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇక తప్పక, ఎట్టకేలకు ఏసీబీ ముందు ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని 3 గంటలకుపైగా ఏసీబీ అధికారులు విచారించారు. రామకృష్ణారెడ్డి నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఏసీబీ తనిఖీల్లో పట్టుబడిన డీఎస్పీ దుర్గాప్రసాద్ ఇంట్లో దొరికిన... ఆర్కే భార్య ఆస్తి పత్రాలకు సంబంధించి ఏసీబీ వివరాలు తెసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు బినామీగా రామకృష్ణారెడ్డి ఉన్నట్లు ఏసీబీకి ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కొన్ని స్థిరాస్తి పత్రాలు ఆళ్ల కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఈ నెల 22న విచారణకు హాజరవ్వాలని 16వ తేదీనఏబీసీ నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాల పేరుతో 22న విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఏసీబీ వారం సమయం ఇచ్చి 29న హాజరవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయన తరపు లాయర్లు ఇంకో వారం అవకాశం ఇవ్వాలని.. తప్పకుండా హాజరవుతారని విజ్ఞప్తి చేశారు. దీంతో జూన్ 5 వరకూ ఏసీబీ తుది గడువు ఇచ్చింది. రెండు సార్లు తన తరపున న్యాయవాదులను పంపిన రామకృష్ణారెడ్డి మూడో సారి స్వయంగా ఏసీబీ ముందు హాజరయ్యారు.
రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ (సీఐయూ)ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది. ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు.