ఏసీబీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మచిలీపట్నంలో ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడ్డాడు. సీజీఎస్టీ రేంజ్ ఆఫీస్ సూపరిండెంట్ రమణేశ్వర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. లోకేష్‌బాబు అనే వ్యక్తిని రమణేశ్వర్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. శుక్రవారం మచిలీపట్నం సెంట్రల్ టాక్స్, సెంట్రల్ ఎక్స్సైజ్ శాఖ సూపరిండెంట్ రమనేశ్వర్ 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. స్థానిక జయలక్ష్మి స్టీల్స్ యజమాని గిరిబాబు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ క్లయిమ్ కోసం వెళ్లగా.. అతనిని రమనేశ్వర్ కొద్ది రోజులుగా లంచం ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ క్రమంలో అతను లంచం ఇస్తుండగా ఏసీబీ పట్టుకుంది. ఏపీలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రమణేశ్వర్ తొలిసారి పట్టుబడ్డాడు. ఏపీలో సీబీఐ ప్రవేశానికి ఏపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారుతోందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు నిర్లజ్జగా తన రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నేతలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఐటీ సోదాలు జరిగిన నేపథ్యంలో... కక్షపూరిత సోదాలకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని కూడా తేల్చేశారు. ఏదో ఒక లింకులు పెట్టి సీబీఐ ద్వారా ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నించే అవకాశాలను తోసిపుచ్చలేమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరో పక్క ఇప్పటికే సిబిఐ వ్యవస్థ రచ్చ రచ్చ అయిన విషయం తెలిసిందే. సిబిఐ లో ఉన్న ఇద్దరు టాప్ బాస్ లు ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవటంతో, వారిని తప్పించారు. ఇందులో ఒకరు మోడీ వర్గం కాగా, మరొక డైరెక్టర్ అలోక్ వర్మ, తనను తప్పించటం పై కోర్ట్ కు వెళ్ళిన విషయం తెలిసిందే.