తెలుగుదేశం నేత మాజీ మంత్రిగా పని చేసిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పై, ప్రభుత్వం అభియోగాలు మోపి, ఆయన్ను ఆర్రేస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా మూడు నెలలు అచ్చెన్నాయుడు జైల్లో ఉన్నారు. చివరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని, హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు పై కావాలని కుట్ర చేసారు అంటూ, ఆరోపిస్తుంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆయన్ను అరెస్ట్ చేసారని చెప్తూ వస్తుంది. నిజాయితీగల రాజకీయాలకు నిలయమైన కింజరాపు కుటుంబానికి కళంకం అంటించాలనే దురుద్దేశం ఒక పక్క, తమ అక్రమాలను గట్టిగా ప్రశ్నిస్తోన్న అచ్చెన్నాయుడుపై కక్ష తీర్చుకోవాలనే ఆలోచన మరో పక్క, ఫలితంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడును వైసీపీ ప్రభుత్వం కావాలనే కుట్ర చేసి అక్రమ కేసుల్లో ఇరికించింది అంటూ, మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉంది. దానికి బలం చేకూరుస్తూ, స్వయంగా వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యింది. గోడదూకి మరీ వెళ్ళి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసిన ఏసీబీ మొదట్లో రూ. 900 కోట్లు స్కాం అంటూ హడావిడి చేసి, తరువాత రూ. 3 కోట్లు అంటూ అభియోగాలు మోపి.. చివరకు 70 రోజుల తర్వాత అచ్చెన్న మీద పెట్టిన కేసులకు ఆధారాలు లేవని ఒప్పుకుందని తెలుగుదేశం పార్టీ చెప్తుంది.
దీనికి సంబందించి తెలుగుదేశం పార్టీ ఒక వీడియో విడుదల చేసింది. ఆగష్టు 19, 2020వ తేదీన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చెప్పిన మాటలు చూపిస్తూ, ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు డబ్బు తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఆయన చెప్పిన మాటలు చుపించారు. ఇంకా ఆగస్టు 28, 2020న హైకోర్టులో సైతం ప్రభుత్వ తరుపు అడ్వకేట్ జనరల్ కూడా, అచ్చెన్నాయుడు ఏ విధమైన నగదు తీసుకున్నట్టు ఆధారాలు లేవని చెప్పారని, ఇదే సందర్భంగా హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ.. " విజిలెన్స్ గతంలో చేసిన ప్రాధమిక విచారణలో కానీ, అరెస్ట్ చేసిన తరువాత రెండు నెలలుకు పైగా కానీ, పిటీషనర్ పై ఏ ఆధారం కోర్టుకు చూపించలేదు" అని పేర్కొందని తీర్పు కాపీ చూపించారు. ఇక తాజాగా, వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను అచ్చెన్నాయుడుని ఇరికించాను కాబట్టి, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు చూపించి, ఇవన్నీ అచ్చెన్నాయుడు పై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు పెట్టింది అనటానికి ఆధారాలు అంటూ, తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఇది ఆ వీడియో https://www.facebook.com/naralokesh/videos/1653724618121512