మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు, బెయిల్ పిటీషన్ పై, ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈఎస్ఐ కుంభకోణం చేసారు అంటూ, ఏసిబీ అధికారులు, అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి, ఆపరేషన్ జరిగిందని తెలిసినా, ఆయన్ను 600 కిమీ తీసుకు రావటం పై, ప్రభుత్వ వైఖరి పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయితే, మరో పక్క అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు రెండు ఆపరేషన్ లు అవ్వటంతో, ఆయనకు ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స ఇవ్వటానికి కోర్టు ఒప్పుకుంది. మరో పక్క అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ పై కూడా వాదనలు జరిగాయి. ఆయనకు బెయిల్ ఇవ్వాలి అంటూ, ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. దీని పై గత రెండు వారాలుగా కేసు వాయిదా పడుతూ వస్తుంది. దీని పై, ఈ రోజు రెండు వైపుల నుంచి, అటు అచ్చెన్నాయుడు వైపు నుంచి, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదనలు కోర్టుకు వినిపించారు.
అచ్చెన్నాయుడు తరుపున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరుపున, ప్రభుత్వ లాయర్లు వినిపించారు. అచ్చెన్నాయుడు కేసులో విజిలిన్స్ ఎంక్వయిరీ రిపోర్ట్ లో, అసలు అచ్చెన్నాయుడు పేరు లేదని, ఆ తరువాత కూడా ఆయన పై అనవసర ఆరోపణలు చేసారని, ఏసిబి చేసిన ఆరోపణల్లో కూడా, అయన పై ఎక్కడా నేరుగా, ఆరోపణలు లేవని, అటువంటప్పుడు ఆయనకు ఆ కేసులో సంబంధం లేదని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చిన కొన్ని ప్రాతిపాదనకు, పరిశీలించాల్సిందిగా, విజ్ఞాపన పత్రాలు ఫార్వర్డ్ చెయ్యటం, ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తూ ఉందని, అది ఏ మంత్రిత్వ శాఖలో అయినా, సహజంగా జరుగుతూ ఉంటుందని, ఈ కేసులో అచ్చెన్నాయుడు పాత్రే లేనప్పుడు ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వాలని, ఆయన తరుపు న్యాయవాది అభ్యర్ధించారు. అయితే ఈ కేసులో ఇంకా దర్యాప్తు చెయ్యాలని, ఇంకా అరెస్ట్ లు చెయ్యాలని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని, ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, తీర్పుని రిజర్వ్ చేస్తూ, కేసును బుధవారానికి వాయిదా వేసింది. దీంతో బుధవారం తీర్పు వచ్చే అవకాసం ఉంది.