ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఇప్పుడు ఒక కొత్త రకం టెన్షన్ పట్టుకుంది. దేశ వ్యాప్తంగా క్రిమినల్ కేసులు ఎదుర్కుంటున్న ప్రజా ప్రతినిధుల జాబితాను ఏడీఆర్ అనే ఒక సంస్థ అధ్యయనం చేసి, ఆ రిపోర్ట్ ను విడుదల చేసింది. 2019 నుంచి 2021 వరకు జరిగిన అనేక ఎన్నికలను పరిగణలోకి తీసుకుని, ఈ రిపోర్ట్ తయారు చేసారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు వేసిన అఫిడవిట్లు ఆధారంగానే, ఈ రిపోర్ట్ ని క్రోడీకరించారు. అంటే, ఈ రిపోర్ట్ లో ఉన్న విషయాలు, వందకు వంద శాతం వాస్తవం. అయితే ఈ రిపోర్ట్ లో ముఖ్యంగా తీవ్రమైన నేరాలు చేసిన వారి జాబితాను మాత్రమే ప్రచురించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(1),(2),(3)లో ఏ నేరాలు అయితే వస్తాయో, వాటి ఆధారంగా నమోదు చేసిన కేసులు, వారి వివరాలను ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ఈ సెక్షన్ ల ప్రకారం నమోదు అయిన కేసులు విషయంలో, కేసు విచారణలో ఈ అభియోగాలు నిజం అని కోర్టు నమ్మి, శిక్ష వేస్తే, ఆ ప్రజాప్రతినిధి అనర్హతకు గురి అవుతారు. మరో పక్క ఈ కేసుల విషయంలో త్వరగా తేల్చేయాలి అంటూ, సుప్రీం కోర్టు కూడా ఈ మధ్య ఉత్తర్వులు ఇవ్వటం, ఆక్టివ్ గా ఆ కేసు ని ముందుకు తీసుకుని వెళ్ళటం అందరూ చూస్తూనే ఉన్నారు.
అయితే ఈ రిపోర్ట్ ప్రకారం, మొత్తంగా దేశంలో 67 మంది ఎంపీలు, 296 మంది ఎమ్మెల్యేల పై తీవ్రమైన అభియోగాలతో కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే, సహజంగా ఈ లిస్టు లో పెద్ద పార్టీలు అయినా బీజేపీ, కాంగ్రెస్, టిఎంసి తరువాత, మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాలుగో స్థానం పొందింది. ఈ లిస్టు లో మొత్తం నలుగురు ఎంపీలు ఉండగా, 18 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఉన్నారు. నిజానికి మరో ఇద్దరు అంటే వాసుపల్లి గణేష్, కరణం పేర్లు కుడా ఉన్నాయి. ప్రస్తుతం వీరు వైసీపీతో ఉన్నారు కాబట్టి, ఈ లిస్టు 20 అనే చెప్పాలి. వీరిలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ కేసులు ఈ మధ్య, వైసీపీ ప్రభుత్వం ఉప సంహరించుకున్న సంగతి తెలిసిందే. దీని పై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా ఈ ఎంపీలు, ఎమ్మెల్యేల పై ఉన్న కేసులు రుజువు అయితే మాత్రం, వారు అనర్హత వేటుకి గురి అవుతారు. ఏది ఏమైనా, ఏపి ఇలాంటి వాటిల్లో ముందు ఉండటం మాత్రం విచారకరం.