భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ.. దేశ ప్రజలకు, తమ పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తమ పార్టీ గురించి తన బ్లాగ్లో పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది. భాజపా శ్రేణులకు ఇది చాలా ముఖ్యమైన రోజు.. ఆత్మపరిశీలనతో పాటు గత జ్ఞాపకాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాల్సిన రోజు. భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరిగా నేను దేశ ప్రజలతో పాటు, కోట్లాది మంది భాజపా శ్రేణులతో నా అభిప్రాయాలను పంచుకోవాలని భావిస్తున్నాను. వారు చూపించిన అభిమానం, గౌరవాలకు నేను రుణపడి ఉన్నాను. ముందుగా నేను గాంధీనగర్ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. 1991 నుంచి వారు నన్ను ఆరుసార్లు ఎంపీగా గెలిపించారు. వారి ప్రేమ, మద్దతు నాకు ఎల్లప్పుడూ సంతోషాన్నిచ్చింది’ అని తెలిపారు.
‘రాజకీయపరంగా మాతో విభేదించే వారిని మేమెప్పుడూ శత్రువులుగా చూడలేదు. మా భావన భారత జాతీయవాదం మాత్రమే. అలాగే, మాతో రాజకీయంగా విభేదించే వారిని మేము ఎన్నడూ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించలేదు. ప్రతి పౌరుడి స్వేచ్ఛకు మా పార్టీ నిబద్ధతతో కట్టుబడి ఉంటుంది. రాజకీయపరంగా కూడా ఇదే తీరుతో ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని, దాని సంప్రదాయాలను కాపాడడం అనే విషయాలు భాజపాలో భాగస్వామ్యంగా ఉన్నాయి. అందుకే స్వాతంత్ర్యం, ఐక్యత, ప్రజాస్వామ్య వ్యవస్థలతో పాటు మీడియా స్వేచ్ఛ, ఎన్నికల సంస్కరణలు, పారదర్శకతలను కాపాడడానికి భాజపా కట్టుబడి ఉంది. మన భారత ప్రజాస్వామ్య విలువలను బలపరచడానికి మనమంతా ఐక్యంగా పోరాడాలన్నదే నా కోరిక’ అని అడ్వాణీ తెలిపారు. మీడియా సహా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు.
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎల్కే ఆడ్వాణీ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని భాజపా ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని ఆడ్వాణీ తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. అలాంటి గొప్ప నేతను సొంత పార్టీనే మర్చిపోవడం బాధాకరమంటూ.. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆడ్వాణీ చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి చేసినవేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తన స్వార్థం కోసం మోదీ... పార్టీని, దేశాన్ని నాశనం చేసే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని మోదీలాంటి వ్యక్తి చేతిలో భాజపా ఉందని, ఆయనవల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, అదే విషయాన్ని ఇప్పుడు ఆడ్వాణీ సున్నితంగా చెప్పారని చంద్రబాబు ట్విటర్లో పేర్కొన్నారు.