వెల్ఫేర్ గ్రూప్ సంస్థల పేరుతో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్ ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించారని, వైసీపీ నేతల అఫిడవిట్‌లలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ వైవీ శేషసాయి ఆరోపించారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్ఫేర్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించడం నేరమని, వెల్ఫేర్ గ్రూప్ సంస్థల పేరుతో అగ్రిగోల్డ్‌ను మించి భారీ కుంభకోణానికి తెరలేపారని ధ్వజమెత్తారు. విజయప్రసాద్ వసూలుచేసిన రూ 1240 కోట్ల సొమ్మును ఆయనే ఆరగించారా, లేక వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారో తేల్చాలని డిమాండ్ చేశారు.
నేర ప్రవృత్తే ప్రధాన అర్హతగా సీట్ల కేటాయింపు జరిగిందని, రూ. 480 కోట్లు చిరునామాలేని డిపాజిట్ దారుల సొమ్మును ఎవరు సేకరించారని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును అక్రమ వ్యాపారాల ద్వారా డిపాజిట్ల రూపంలో వేల కోట్లు కొల్లగొట్టిన విషయం వాస్తవమో కాదో నిగ్గు తేల్చాలన్నారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్, మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌లపై సీబీఐ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వివరించారని, వారిపై ఏ నేరం కింద కేసులు నమోదయ్యాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఎన్నికల్లో చిత్తశుద్ధితో పోటీ చేయాలంటే రూ. 1250 కోట్లు ప్రజలకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాసేవకు రావాలంటే డిపాజిట్లు తిరిగి చెల్లించాలన్నారు. వైసీపీ మాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని సాయిబాబు అన్నారు.