అధికవడ్డీ ఆశచూపి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ సంస్థలో మరో కీలక అరెస్ట్ జరిగింది. అగ్రిగోల్డ్ మోసం బయటకు వచ్చినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న వైస్ ఛైర్మన్ అవ్వా సీతారామారావు ఎట్టకేటలకు పట్టుబడ్డాడు. సీఐడీ పోలీసులు దిల్లీలో అరెస్ట్ చేశారు. సీతారాం గతంలో అగ్రిగోల్డ్ కు డైరక్టర్‌గా వ్యవహరించాడు. కంపెనీ లావాదేవీలను తెరవెనుక నుండి నడిపించేవాడు. అగ్రిగోల్డ్ పై కేసు నమోదు తర్వాత సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ముందస్తు బెయిల్ కోసం ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌ను సంప్రదించాడు. అయితే హైకోర్టు బెయిల్ నిరాకరించటంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న తనవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.
అగ్రిగోల్డ్ సంస్థలను వేలంలో కొనేందుకు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూప్ సంస్థలను సీతారామారావు ప్రభావితం చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సీఐడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సీతారాంను ఎట్టకేలకు సీఐడీ పోలీసులు గూడ్‌గావ్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడ్ని స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై రేపు ఉదయం విజయవాడకు తీసుకువచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. అగ్రిగోల్డ్ అసలు ఆస్తులెంత? లావాదేవీలు ఎలా జరిగాయి? అనే విషయాలపై సీతారామారావును పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.
గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న సీతారామారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారని తెలుసుకుని ట్రాప్ చేశారు. ఏపీ నుంచి వెళ్లిన సీఐడీ అధికారులు ఢిల్లీలో సీతారామారావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొదటి నుంచి సీతారామారావు ప్రమేయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పోలీసుల అదుపులో ఉన్న సీతారామారావును విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో వైస్ ఛైర్మన్ అవ్వాస్ సీతారామారావును అరెస్టు చేయడం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల పోరాట సంఘం అధ్యక్షుడు ముపాళ్ళ నాగేశ్వరరావు, తిరుపతిరావు హర్షం వ్యక్తం చేశారు.