నవంబర్ 8... ఈ తారీఖు ప్రతి భారతీయుడికి గుర్తుండి పోయే రోజు.. 500, 1000 నోట్లు రద్దుతో, ప్రతి ఒక్క పౌరుడు ఇబ్బంది పడ్డాడు.. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. అయితే అప్పట్లో దేశ ప్రయోజనాల కోసమని నమ్మి ప్రజలు కష్టమైన సహకరించారు. కాని రాను రాను, ప్రజల ఇబ్బందులు తీర్చటంలో మోడీ ఫెయిల్ అయ్యారు. ఎందుకు చేసారో, దాని ఉద్దేశం ఏంటో పక్కదారి పట్టింది. బీజేపీ నేతలు ఆ చర్యల వల్ల లాభపడ్డారు కాని, సామాన్య ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు, ప్రతి సెక్టార్ దెబ్బతింది. చిన్న వ్యాపారాలు భారీగా దెబ్బ తిన్నాయి. ఈ కోవలోనే రైతన్నలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాని కేంద్రం మాత్రం, అంతా బాగుందని బుకాయిస్తూ వచ్చింది. కాని నిజం బయటకు రాకుండా ఉండదు కదా...
పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ ఇటీవల నివేదిక రూపొందించిన కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా యూటర్న్ తీసుకుంది. నోట్ల రద్దు వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడిందని చెబుతోంది. గణాంకాలను తీసుకోవడంలో జరిగిన పొరబాటు వల్లే గతంలో ఆ నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. వ్యవసాయ రంగంపై నోట్లరద్దు ప్రభావంపై ఇటీవల ఆ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ ప్యానెల్‌కు నివేదిక అందించింది. అందులో..‘పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత రూ. 15లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణి నుంచి వెనక్కివెళ్లాయి. ఫలితంగా వ్యవసాయ రంగంలో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. రబీ సీజన్‌లో రైతులు విత్తనాలు, పురుగుల మందులు కొనుక్కోలేకపోయారు’ అని వ్యవసాయ శాఖ ఆ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
ఇవి కాస్తా వివాదాస్పదంగా మారడంతో తాజాగా నష్టనివారణ చర్యలు చేపట్టింది వ్యవసాయ శాఖ. నోట్ల రద్దుపై పార్లమెంటరీ ప్యానెల్‌కు మరోసారి నివేదిక సమర్పించిన మంత్రిత్వశాఖ.. గణంకాల సేకరణలో జరిగిన పొరబాట్ల కారణంగా గతంలో అలా చెప్పామని పేర్కొంది. నిజానికి నోట్ల రద్దుతో వ్యవసాయ రంగం లాభపడిందని, రబీ సీజన్‌లో విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలు కూడా పెరిగాయని తాజా నివేదికలో తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేగాక 2016 రబీ సీజన్‌లో పంటల దిగుబడి కూడా పెరిగిందని నివేదికలో పేర్కొన్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. మొత్తానికి చేసిన ఒక తప్పుకు, తప్పు మీద తప్పు చేస్తూ, కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తుంది.