ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు పోషకాహారలోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘గిరి ఆహార పోషణ’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 6రకాల పోషకాలు ఉండే రూ.532 విలువైన ఆహారబుట్టను ఒక్కో గిరిజన కుటుంబానికి మార్చి 1వ తేదీ నుంచి ప్రతి నెలా ఉచితంగా ఇవ్వనుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయంలో ప్రారంభించారు. ప్రస్తుతం బాలింతలు, చిన్నారులకు గిరి గోరుముద్దలు, అన్న అమృతహస్తం వంటి పథకాలను అమలు చేస్తోంది. ఈ కొత్త పథకం మొత్తం ఐటీడీఏల పరిధిలోని గిరిజనుల కోసమని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు గంధం చంద్రుడు ‘ఈనాడు’కు తెలిపారు. ఆహారబుట్టల కొనుగోలు, పంపిణీ బాధ్యత పౌరసరఫరాల శాఖకు అప్పగించామని చెప్పారు.
ఒక్కో బుట్టకు అయ్యే వ్యయం: రూ.532 ఎవరికి ఇస్తారు: 7 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలోని గిరిజన కుటుంబాలకు, గిరిజన జనాభా 40శాతం కన్నా అధికంగా ఉన్న వివిధ జిల్లాల్లోని 41 మండలాల్లోని వారికి. అర్హత: కుటుంబాలకు తెల్లరేషన్‌కార్డుంటే చాలు. ఎన్ని ఇస్తారు: కుటుంబానికి 1 చొప్పున. ఆదిమ తెగలకు (పీవీటీజీ) నెలకు 2 చొప్పున. ఎక్కడ ఇస్తారు: ఐటీడీఏల పరిధిలోని రేషన్ దుకాణాలు, గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆధీనంలోని డీఆర్ డిపోల ద్వారా అందిస్తారు. ఎంత మందికి: ప్రతి నెలా మొత్తం 2,00,668 కుటుంబాలకు లబ్ధి. ఎందుకోసమంటే: నిరక్షరాస్యత, పేదరికం, పోషకాహారంపై సరైన అవగాహన లేని కారణంగా ఐటీడీఏల పరిధిలోని గిరిజనులు త్వరగా అనారోగ్యానికి గురవుతున్నారు.
రక్తహీనత వంటి సమస్య ఎక్కువగా ఉంటోంది. జీవనకాలం కూడా తక్కువగా ఉంటోంది. వీరందరికీ సరైన సమయంలో పోషకాహారాన్ని అందిస్తే వారి జీవన ప్రమాణ స్థాయి పెంచవచ్చన్న ఉద్దేశంతో జాతీయ పోషకాహార సంస్థ సూచించిన ప్రకారం వీటిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత వ్యయం: పతి నెలా ఆహారబుట్టలు ఇవ్వడానికి రూ.10.67 కోట్ల వ్యయం అవుతోంది. 2018-19 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన పలువురు లబ్ధిదారులకు ఆహారబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా రేషన్ సరకులతో పాటే వీటిని అందిస్తామని వెల్లడించారు.