ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. ఓ వైపు అధికార పార్టీ.. మరోవైపు ప్రతిపక్ష పార్టీ రెండూ కూడా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి కండువా కప్పుకునేందుకు ఎవరొచ్చినా కాదనకుండా సాదరంగా ఆహ్వానించేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇన్నాళ్లు ఆయా పార్టీలకు దూరంగా ఉంటున్న నేతలు సైతం 2019 ఎన్నికలతో రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అధికార, ప్రతిపక్ష పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ బలంగా ఉంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇలా అన్నీ అలోచించి, అడుగులు వేస్తున్నారు.
తాజాగా.. మాజీ మంత్రి, కడప జిల్లా కీలక నేత హాజీ అహ్మదుల్లా కాంగ్రెస్‌కు బైబై చెప్పి సైకిలెక్కిందుకు సిద్ధమయ్యారు. గురువారం నాడు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అహ్మదుల్లా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. రాష్ట్ర విభజనాంతరం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. టీడీపీ నేతలకు టచ్‌లో ఉన్నారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన టీడీపీతోనే రీ-ఎంట్రీ ఇవ్వాలని భావించి కీలక నేతలతో చర్చించిన అనంతరం సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈయన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఒకసారి భేటీ అయిన విషయం విదితమే. ఈ భేటీలోనే టికెట్ వ్యవహారంపై చర్చించారని.. కడప అసెంబ్లీ ఫిక్స్ చేశారని సమాచారం.
కాగా.. 2004, 2009 ఎన్నికల్లో అహ్మదుల్లా ఇదే కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసి రెండుసార్లూ గెలుపొందారు. అప్పట్లో ఒక దఫా ఏపీ కేబినెట్లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2014 ఎన్నికలకు పూర్తిగా దూరమైన అహ్మదుల్లా తాజాగా టీడీపీతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి అంజద్ భాషా 45వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీన అహ్మదుల్లా తన కొడుకు అష్రఫ్తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. వచ్చే ఎన్నికల్లో అహ్మదుల్లా టీడీపీ అభ్యర్థిగా కడప నుండి పోటీ చేయనున్నారు.రేపు చంద్రబాబునాయుడు సమక్షంలో అహ్మదుల్లా ఆయన తనయుడు ఆష్రఫ్ టీడీపీలో చేరనున్నారు.