ఎయిమ్స్ .... ఈ పేరు వినగానే అత్యాధునిక వైద్యసేవలు గురుకొస్తాయి. విభజన వరాల్లో ఒకటిగా మంగళగిరి ప్రాంతంలో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. 2015 డిసెంబరు 19న శంకుస్థాపన చేసిన, ఇరవై మాసాల అనంతరం కేంద్రం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.1680 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ఆసుపత్రితో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.
ముందుగా రూ.600 కోట్లకు పైగా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా ఎయిమ్స్ నిర్మాణ పనులకు టెండర్లను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. రూ.300 కోట్ల వ్యయంతో ఓపీ విభాగంతోపాటు సిబ్బంది క్వార్టర్లు, మరో రూ.300 కోట్ల వ్యయంతో ఆసుపత్రి భవనాలు, వైద్య కళాశాల భవనాలను నిర్మించనున్నారు. ఇప్పటికే రూ.8.5 కోట్ల వ్యయంతో ప్రతిపాదిత ఎయిమ్స్ స్థలం 192 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. తొలిదశలో 40 భావనాలు కట్టనున్నారు.
ఈ ఏడాది నుంచే ఎయిమ్స్ మొదటి సంవత్సరం mbbs తరగతలు ప్రారంభం కానున్నాయి. తాత్కలింగా విజయవాడ సిద్ధార్ధ మెడికల్ కాలేజీలో క్లాసులు ప్రారంభం కానున్నాయి.
ఎయిమ్స్‌లో ఏమేం వుంటాయంటే..
960 పడకలతో కూడిన సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, ఏటా వంద సీట్లతో కూడిన వైద్య కళాశాల, ఏటా 60 సీట్లతో కూడిన నర్సింగ్ కళాశాల, కార్యనిర్వాహక బ్లాకు, ఆయూష్ బ్లాకు, ఆడిటోరియం, నైట్ షెల్టర్, హాస్టళ్లు, నివాసిత భవన సముదాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత అధునాతన పద్ధతుల్లో నిర్మించనున్నారు. ఆసుపత్రిలోని 960 పడకలను మూడు ప్రధాన విభాగాలుగా విభజిస్తారు. స్పెషాలిటీ విభాగాలకు 500 పడకలు, సూపర్ స్పెషాలిటీ విభాగాలకు 300 పడకలు, ఇతర విభాగాలకు కలిపి 160 పడకల వంతున కేటాయించారు.
ఎయిమ్స్ ప్రాంగణం విభజన ఇలా..
193 ఎకరాల విస్తీర్ణం కల ఎయిమ్స్ ప్రాంగణాన్ని కేటాయించారు. ఆసుపత్రి దాని ఆధారిత అనుబంధ సేవా విభాగాలకు కలిపి లక్షా 31వేల చదరపు మీటర్లు, సంస్థలు, బోధన విభాగాలకు కలిపి 41వేల చదరపు మీటర్లు, నివాసిత భవన సముదాయాలకు 53వేల చదరపు మీటర్లు వంతున కేటాయించారు.