తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో రాష్ట్రీయ లోకదళ్ (ఆర్ఎల్డీ) నాయకుడు అజిత్ సింగ్ గురువారం నాడు కలిశారు. జాతీయ రాజకీయాలపై చంద్రబాబు, అజిత్ సింగ్ ల మధ్య చర్చ జరిగింది. దేశ రాజకీయాల గురించి అజిత్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించారు. అయితే ఈ భేటీ పై అమిత్ షా అరా తీసినట్టు సమాచారం. అమరావతి దాకా వెళ్లి, అజిత్ సింగ్, చంద్రబాబుని కలవాల్సిన అవసరం ఏముంది అంటూ, అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తుంది. జాతీయ రాజకీయాల్లో గత రెండు నెలలుగా చంద్రబాబు ఆక్టివ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 17 పార్టీలను చంద్రబాబు ఏకతాటి పై తెచ్చారు.
పోయిన వారం కూడా, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడ వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. జాతీయ పార్టీలతో మరోసారి భేటీ కావాల్సిన అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది... జాతీయ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్లపై చర్చ జరుగుతున్న సమయంలో ఇరువురు నేతల భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఇప్పుడు మళ్ళీ ఆర్ఎల్డీ నాయకుడు అజిత్ సింగ్ అమరావతి రావటంతో, మరోసారి చర్చ ప్రారంభం అయ్యింది. రానున్న రోజుల్లో చంద్రబాబు ఎలాంటి పాత్ర, జాతీయ రాజకీయాల్లో పోషిస్తారో చూడాల్సి ఉంది.
మరో పక్క, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి పచ్చజెండా ఊపారు. ఈ నెల 14 నుంచి ఆన్ లైన్లో యువనేస్తం కార్యక్రమం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో అక్టోబర్ రెండో తేదీ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో బీపీఎస్ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కు 151 జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో 30వేల మందికి నెలసరి జీతం వేయి నుంచి రెండు వేల రూపాయలు పెరగనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం చెల్లించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.