ఏపీ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి అర్బన్) పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాని కలిసి తన రాజీనామా లేఖను అందజేస్తారని సమాచారం. ప్రస్తుతం ఏపీ బీజేపీలో తలెత్తిన పరిణామాలను తనకు రుచించలేదని, కన్నా లక్ష్మీనారాయణకు, పార్టీ కేడర్‌కి అగాధం ఏర్పడిందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. వీటితో పాటు తన వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో రాసినట్టు తెలుస్తుంది. అయితే ఆకుల సత్యానారాయణ జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇంతకు ముందు టీడీపీలో చేరాలని భావించారని సమాచారం. అయితే అధ్యక్షుడు చంద్రబాబు నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడంతో టీడీపీలో చేరాలన్న ఆలోచన విరమించుకొని జనసేనలో చేరాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. మరోవైపు ఆకుల సతీమణి ఇప్పటికే జనసేనలో కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి 2014లో ఆకుల సత్యనారాయణ, బీజేపీ తరపున గెలుపొందారు. ఈ వార్తలు వస్తూ ఉండగానే, ఆయన ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు.
ఈ విషయమై ఆకుల సత్యనారాయణ ఢిల్లీలో స్పష్టత ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకునేందుకు ప్రస్తుతం తాను ఢిల్లీకి వచ్చానని సత్యనారాయణ తెలిపారు. షా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారనీ, త్వరలోనే ఢిల్లీకి తిరిగివస్తారని వ్యాఖ్యానించారు. ఆయన అపాయింట్ మెంట్ తనకు ఇంకా లభించలేదన్నారు. అమిత్ షాను కలుసుకున్నాక పార్టీ మారడంపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. రాజీనామా విషయం ఇంకా ఆలోచించలేదని, నియోజకవర్గ సమస్యలపై కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. అయితే, నియోజకవర్గ సమస్యల గురించి, అమిత్ షాతో మాట్లాడేది ఏముంటుందో, ఆయనకే తెలియాలి. అమిత్ షా నుంచి ఆదేశాలు రాగానే, జనసేనలో జాయిన్ అవుతారని సమాచారం..