ప్రముఖ హాస్య నటుడు అలీ రాజకీయ రంగం ప్రవేశం ఇప్పటికే ఖాయమైంది. అయితే, అది ఏ పార్టీ నుంచి అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్‌తోనూ ఆయన భేటీ కావడంతో ఆయన తొలుత వైసీపీ, తర్వాత జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే, వీటిని అలీ కొట్టిపారేశారు. తాజాగా మంగళవారం టీడీపీ నేత, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో అలీ భేటీ అయ్యారు. ఓ సినిమా షూటింగ్ కోసం విశాఖకు వెళ్లిన ఆయన గంటాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీకి తనకు అవకాశం ఇచ్చిన పార్టీకే జై కొడతానని పేర్కొన్నారు.
తనకు ఒక గురువు ఉన్నారని, జనవరి 16 వరకు రోజులు బాగాలేవని ఆయన చెప్పారని, ఆ తేదీ తరువాతే తాను ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. టీడీపీ అంటే తనకు అభిమానమని, సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులతో తనకు పరిచయాలున్నాయని, తనను వారు ఓ సోదరుడిలా చూసుకుంటారని తెలిపారు. గతంలో తాను గంటాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే, మంత్రి గంటాకు తాను చెప్పాల్సింది చెప్పానని, ఆయన తనను సిఫారసు చేస్తారని భావిస్తున్నానని పరోక్షంగా టీడీపీలో చేరుతాననే సంకేతాలిచ్చారు.
అంతేకాదు, తాను 20 ఏళ్ల నుంచి కార్యకర్తగానే ఉన్నానని, ఇక అభ్యర్థిగా ఉండాలన్నది తన అభిమతమని వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి గంటా మాట్లాడుతూ.. అలీ గురించి ముఖ్యమంత్రికి తెలుసని, ఆయన ఉద్దేశాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని వివరించారు. తాను కూడా ముఖ్యమంత్రికి చెప్పాల్సినవి చెబుతానన్నారు. గుంటూరు నుంచి పోటీ చేయడానికి అలీ ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అయితే ఆలీ ప్రతిపాదన పై చంద్రబాబు ఎలా స్పందిస్తారు ? అలీ చెప్పింది చేస్తారా ? గంటా రాయబరాం ఫలిస్తుందా ? ఇప్పటికే ఉన్న ఆశావాహులు ఎలా రియాక్ట్ అవుతారు ? ఇవన్నీ తెలియాలంటే, చంద్రబాబు రియాక్షన్ కోసం ఎదురు చూడటమే...