ప్రత్యేక హోదాతో పాటు విభజన డిమాండ్లను సాధించేందుకు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరోవైపు ఢిల్లిలో వివిధ రాజకీయ పార్టీలు ఇదే డిమాండ్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు తన జన్మదినోత్సవం రోజున విజయవాడలో నిర్వహించిన 12 గంటల మౌన నిరశన దీక్ష హస్తినలో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో వేడి పుట్టించింది. ఫలితంగానే చంద్రబాబుకు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు తాజా పరిణామాల నేపథ్యంలో సంఘీ భావంగా నిలవాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ చాంబర్‌లో అందుబాటులో ఉన్న వివిధ పార్టీల నేతలు సమావేశమై ఈ మేరకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు భావసారూప్యత కలిగిన ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకోనిపోవాలని నిర్ణయించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఒత్తిడి పెంచితేనే జఠిలంగా మారిన హోదా, విభజన అంశాల సమస్య ఒక కొలిక్కి వస్తుందని వారు భావించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమా చారం అందించారు కూడా. తొలుత ఏపీ డిమాండ్లపై చంద్రబాబునాయుడు దీక్షను కూడా ప్రస్తావిస్తూ ఒక లేఖ రాయాలని నిర్ణయించారు. స్పందనను బట్టి ప్రధానమంత్రిని కలుసుకొని ఒత్తిడి పెంచాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు అన్ని పార్టీలతో కలిసి అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే ఏయే పార్టీలను ఏపీ విషయంలో కలుపుకోవాలనే విషయమై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశాలున్నాయి.
దీక్ష జరుగుతున్న సమయంలో కూడా పలువురు నేతలు ఢిల్లి నుంచి ఫోన్ చేయడం కూడా ప్రాధాన్యతను సంతరించుకోంది. అయితే, చంద్రబాబు దీక్షలో ఉండటంతో, మాట్లాడలేక పోయారు. సాయంత్రం, తిరిగి వారందరికీ ఫోన్ లు చేసినట్టు సమాచారం. ఇదే విషయం నిన్న చంద్రబాబు మంత్రులతో చెప్పారు. దీక్షలో ఉండ డం వల్ల తాను మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని అందుబాటులో ఉన్న నేతలతో భేటీ సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలపై ఒక లేఖ రాయాలని ఢిల్లిలో కొన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామమని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తాను ఇటీవల జరిపిన ఢిల్లి పర్యటనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైందని, నరేంద్ర మోడీకి ప్రమాద ఘంటికలేనని పేర్కొన్న ముఖ్యమంత్రి నిరశన దీక్షతో ఏపీకి జరిగిన అన్యాయంపై ఎలుగెత్తి చాటినట్లయిందని పేర్కొన్నట్లు తెలిసింది. సైకిల్ యాత్రలతో పాటు తిరుపతి బహిరంగ సభతో ఉద్యమం క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జాతీయ పార్టీల మద్దతు ఉంటే నరేంద్రమోడీ దిగిరావాల్సిందేనని, లేఖ రాయడం అనేది కొత్త పరిణా మమేనని అన్నారు. తన జన్మదినోత్సవం రోజు దీక్షకు పూనుకోవడం దేశ ప్రజలను ఆకర్షించగా దీక్ష ప్రారంభం కాగానే కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీల్లో కూడా కదలిక రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు.