ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, గ్రామం ఇంధన పొదుపునకు చిరునామాగా మారాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వచ్చే సంక్రాంతి కల్లా 100 శాతం ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 30న కలెక్టర్ల సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఇంధన, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతి కల్లా మొత్తం 27 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

led 30112018 2

సంక్రాంతి పండగకల్లా గ్రామాల్లోని వీధులన్నీ ఎల్‌ఈడీ వెలుగులతో నిండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈసారి సంక్రాంతికి కొత్త వెలుగులు నిండాలని, ఎల్‌ఈడీ దీపాల కాంతుల్లో ప్రజలు పండగ చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆరు జిల్లాల్లో (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, చిత్తూరు, కడప, అనంతపురం) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రామాల్లో 18.81 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్రాలన్నీ కలిపి కేవలం 9000 లైట్లు మాత్రమే ఏర్పాటు చేశాయని వివరించారు. మొత్తం జాతీయ ఎల్‌ఈడీ కార్యక్రమంలో 33 శాతంతో ఏపీ అగ్రపథంలో నిలిచిందని పంచాయతీరాజ్, ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కలెక్టర్ల సదస్సులో ఎల్‌ఈడీ వీధి దీపాల కార్యక్రమంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖను కోరారు.

led 3011201 8 3

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కే జవహర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈఈఎస్‌ఎల్ మద్దతుతో 6466 గ్రామ పంచాయతీల్లో 18.81 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చినట్లు చెప్పారు. జనవరి 15 కల్లా నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సంకల్పాన్ని నెరవేర్చటానికి కృషి చేస్తామని అన్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 27 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు పూర్తయితే ఏటా 300 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపుతో ఖజానాకు రూ. 180 కోట్లు ఆదా అవుతున్నాయన్నారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, జీ సాయి ప్రసాద్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజవౌళి, అడిషనల్ సెక్రటరీ. ఏపీ ట్రాన్క్సో, ఎండీ ఏపీ జెంకో కే విజయానంద్, నెడ్క్యాప్ ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read