ఓ వైపు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతుంటే... మరోవైపు సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. తమకు పాణ్యం టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ నిరాకరించడంతో... వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు గౌరు దంపతులు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉండటంతో... ఆయన కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారేమో అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
రాజధాని పరిధిలోని మంగళగిరి వైసీపీలో ముసలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు శుక్రవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం అధినేతపై అసంతృప్తితో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శుక్రవారమంతా ఆయన ఎవరికీ ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెక్ పెట్టేందుకు పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం నేతలు మున్నంగి గోపిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి పావులు కదిపారు. మంగళగిరికి చెందిన టీడీపీ, బీజేపీ, సీపీఎం కౌన్సెలర్లు ఉడతా శ్రీను, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర శకుంతలను జగన్ సమక్షంలో వైసీపీలో చేర్పించారు. ఈ పరిణామం ఆళ్ల వర్గానికి షాక్‌కు గురిచేసింది.
ఉడతా శ్రీనును మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల వ్యతిరేక వర్గం ప్రచారం చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆళ్ల సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంగళగిరి పట్టణం, రూరల్, తాడేపల్లి పట్టణం, రూరల్, దుగ్గిరాల మండలాలకు చెందిన వైసీపీ కన్వీనర్లు, పలువురు వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మంగళగిరి ఎంపీపీ తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. మరోవైపు ఆళ్లతో సంప్రదింపులు జరిపేందుకు పలువురు వైసీపీ నేతలు రంగంలోకి దిగారని తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఎవరికీ టచ్‌లోకి రాలేదని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ? ఆయన కూడా టికెట్ రాని పక్షంలో పార్టీని వీడతారా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.