ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మల్యే, పార్టీ మారితే, నియోజకవర్గంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. స్థానిక క్యాడర్ అంతా నిరుత్సాహంలో ఉంటుంది. పార్టీతో ఉండే వారు కొందరు అయితే, ఆ పార్టీ మారిన నాయకుడితో వెళ్ళే వారు మరి కొందరు. అయితే, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. మాకు పట్టిన దరిద్రం వదిలింది అంటూ, ఈ రోజు నియోజకవర్గం అంతా తెలుగుదేశం శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశంకి రాజీనామా చేస్తున్నా ని చెప్పి, జగన్ మొహన్ రెడ్డిని కలవగానే, అందరూ పండుగ చేసుకున్నారు. అసలు అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే, ఆమంచి జగన్ ను కలిసిన తరువాత మాట్లాడిన మాటలు.
"జగన్మోహన్ రెడ్డి నీతివంతుడుగా ఉంటాడు, నాలాంటి నీతిమంతులు అందరూ జగన్మోహన్ రెడ్డితో నడవాలి, నీతివంతమైన రాజకీయాలకు నేను పెట్టింది పేరు" అంటూ ఆమంచి చెప్పిన ఈ డైలాగ్ తో, రాష్ట్రమంతా పడి పడి నవ్వుతుంది. ఇది ఇలా ఉంటే ఆమంచి జగన్ ను కలుస్తున్నాడు అని తెలియగానే, చంద్రబాబు రంగంలోకి దిగారు. తక్షణమే రంగంలోకి మాజీ మంత్రి కరణం బలరాంను దించారు. చీరాల తెలుగుదేశం నేతల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో, కరణం బలరాం హుటాహుటిన అక్కడకు బయలుదేరి వెళ్లారు. అలాగే కరణం బలరాంకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.
ఈ గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందంటూ ఫ్లెక్సీల్లో ముద్రించడంతో చీరాల ఎమ్మెల్యే టిక్కెట్ ఆయనకు దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మనల్ని నమ్మించి వంచించిన నాయకులకు బుద్ధిచెప్పాలే తిరగబడ్డ తెలుగుబిడ్డ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఇదిలా ఉండగా, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుంచి కరణం బలరాం టీడీపీ తరఫున బరిలోకి దిగుతారనే టాక్ వినబడుతోంది. కరణం బలరాంను చీరాల నుంచి బరిలోకి దింపితే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, కరణం వర్గాల మధ్య ఉన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయని చంద్రబాబు భావిస్తున్నట్టు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏదైనా ఆమంచి దరిద్రం వదిలినందుకు, తెలుగుదేశం శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి.