రాజధాని అమరావతి ఉద్యమం 250 రోజులకు చేరుకుంది. ఈ రోజు రాజధాని రణభేరీ పేరుతో, కార్యక్రమాలు ప్లాన్ చేసింది అమరావతి జేఏసి. అయితే ఈ నిరసనల్లో ఉదయం నుంచి పెద్ద ఎత్తున రాజధాని రైతులు పాల్గున్నారు. తమ ఆవేదన వినండి అంటూ, డప్పులు మోగిస్తూ నిరసన తెలిపారు. 250 రోజులుగా శాంతియుత నిరసన చేస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని కోరుతున్నారు. ఇక మరో పక్క పోలీసులు రాజధాని ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసారు. అమరావతి గ్రామాలకు బయట వారిని పంపించటం లేదు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి మద్దతు పలికే వారికి ఈ పరిణామంతో, ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు ఐడి కార్డులు చెక్ చేసి, ఆ గ్రామాల వారు అయితేనే గ్రామాలకు అనుమతి ఇస్తున్నారు. గుంటూరు, విజయవాడ నుంచి వచ్చి కొంత మంది ఈ పరిణామంతో నిరాస చెందారు. కరకట్ట వద్ద పోలీసులు వచ్చే పోయే వాహనాలకు చెక్ చేసి పంపిస్తున్నారు. తనిఖీలు చేసి, ఏదైనా ఐడి కార్డు ఉంటేనే, వారు రాజధాని ప్రాంత వాసులు అయితేనే లోపలకు అనుమతి ఇస్తున్నారు. స్థానికులను మాత్రమే వదిలి పెడుతున్నారు. స్థానికులు కాని వారిని మాత్రం, వెనక్కు పంపిస్తున్నారు. స్థానికులు కాని వారు, 250 రోజులు ఉద్యమంలో పలు పంచుకుందాం అనుకున్న వారికి నిరాస ఎదురు అయ్యింది.
ఇక అలాగే అమరావతి గ్రామాల్లో దీక్షా శిబిరాల దగ్గర కూడా, పోలీసులని మోహించారు. వచ్చే పోయే వాహనాలు మానిటర్ చెయ్యటంతో పాటుగా, పరిస్థితిని ఆరా తీస్తున్నారు. బయట నుంచి వచ్చే వారు ఎవరైనా ఉన్నారా అనేది పోలీసులు చూస్తున్నారు. మొత్తానికి ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే అమరావతి వాసులు మాత్రం, ఇన్నాళ్ళు మా ఉద్యమం ఎప్పుడు లైన్ దాటలేదని, బయట నుంచి వచ్చి మాకు మద్దతుని ఇచ్చే వారికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు రాజధాని రణభేరీ, దగా పడ్డ దళిత బిడ్డ, అమరావతి వెలుగు, ఆంధ్రప్రదేశ్ వెలుగు లాంటి అనేక కార్యక్రమాలను అమరావతి రైతులు చేస్తున్నారు. సాయంత్రం కాగడాల ప్రదర్శనకు కూడా జేఏసి పిలుపు ఇచ్చింది. అలాగే ఈ మొత్తం కార్యక్రమాలను కో-వి-డ్ నిబంధనలు పాటిస్తూ, ఎలాంటి నిబంధనలు అతిక్రమించకుండా క్రమశిక్షణతో చేస్తూ వస్తున్నారు. రాజధాని గ్రామాల్లో అనుమతి లేకపోవటంతో, వివిధ పార్టీల ప్రతినిధులు ఆన్లైన్ లో తమ మెసేజ్ పంపించారు. అలాగే విజయవాడలో ఉన్న జేఏసి కార్యాలయంలో, అఖిలపక్ష నేతలు అమరావతికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తంగా, కేవలం అమరావతి ప్రాంత రైతులే పాల్గునేలాగా, పోలీసులు జాగ్రత్త తీసుకున్నారు.