నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని కీలక ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు కొలువుదీరనున్నాయి. వివిధ పనులపై రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. దేశవిదేశాల నుంచి అమరావతికి వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరగనున్న దృష్ట్యా ఇక్కడ ఆతిథ్యరంగం అంతర్జాతీయస్థాయిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించింది. ఈ మేరకు.. పేరున్న హోటల్ గ్రూపులను రప్పించడంలో ఏపీసీఆర్డీయే సఫలీకృతమైంది. అమరావతిలో తొలి విడతలో నాలుగేసి చొప్పున 5, 4 స్టార్ హోటళ్ల స్థాపనకు సీఆర్డీయే పచ్చజెండా ఊపింది. 5 స్టార్ హోటళ్లకు ఒక్కొక్కదానికి 4 ఎకరాలు, ఫోర్‌స్టార్ హోటళ్లకు రెండేసి ఎకరాల చొప్పున ఎకరం.. రూ.1.50 కోట్ల లెక్కన ప్రోత్సాహక ధరకే విక్రయిస్తోంది.
ఉన్నతాధికారులు, నిపుణులతో అధ్యయనాలు, పరిశీలనలు, సమావేశాలు, వివిధ దశల్లో వడపోతలు ఇత్యాది కార్యక్రమాల అనంతరం నియమ నిబంధనల ప్రకారం వాటికి అవసరమైన భూకేటాయింపులు జరగనున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 3 నెలల్లోగా నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశాలుండగా, మూడేళ్లలో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటికి.. రాజధానికి సందర్శకుల సంఖ్య బాగా పెరిగి, హోటల్ గదులకు మంచి గిరాకీ వస్తుందని అంచనా.
అమరావతిలో 5 స్టార్ కేటగిరిలో హోటళ్లను నెలకొల్పే అవకాశాన్ని నోవాటెల్, హిల్టన్, క్రౌన్ ప్లాజా, డబుల్ ట్రీ అనే ప్రఖ్యాత గ్రూపులు దక్కించుకున్నాయి. ఒక్కో హోటల్‌లో 200 గదులుంటాయి. ఇవి కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలున్న రెస్టారెంట్లు, లాంజ్‌లు, బాంక్వెట్ హాళ్లు, పార్కింగ్ వసతులు కొలువు దీరతాయి. ఇక.. 4 స్టార్ హోటళ్లను స్థాపించేందుకు హాలిడే ఇన్, గ్రీన్ పార్క్, జీఆర్‌టీ, దసపల్లా గ్రూపులు ఎంపికయ్యాయి. ఇప్పటికే వీటి ఏర్పాటుకు సంబంధించిన ఎల్‌ఓఐ (లెటర్ ఆఫ్ ఇంటెంట్- అంగీకారపత్రాలు)లను ఆయా హోటల్ గ్రూపులకు జారీ చేసిన సీఆర్డీయే.. మిగిలిన అధికారిక లాంఛనాలను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.