మూడు ముక్కాల రాజధాని ప్రకటన చేసి, అమరావతికి అన్యాయం చేసి, నేటికి 550వ రోజు. అటు అమరావతిని నాశనం చేసారు. ఇటు మూడు రాజధానులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. అయితే తమకు జరిగిన అన్యాయం పై గత 550 రోజులుగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఈ రోజుతో ఉద్యమం 550వ రోజుకి చేరుకుంది. 550వ రోజులుగా దీక్షలు, ధర్నాలు, వివిధ రూపాల్లో శాంతియుత నిరసనలు చేస్తున్నా, ఈ ప్రభుత్వం తమని పట్టించుకోవటం లేదని రైతులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. 550వ రోజు సందర్భంగా, ఉద్యమ కార్యాచరణలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి నివాసానికి, మందడం నుంచి, అదే విధంగా ఇతర గ్రామాల నుంచి ప్రజలు వస్తారని సమాచారం ఉంది అంటూ, తాడేపల్లిలోని జగన్ మోహన్ రెడ్డి నివాసంలో, భారీ భద్రత ఏర్పాటు చేసారు. అటు గ్రామాల్లో కూడా భారీ ఎత్తున పోలీసులను దించారు. ముఖ్యంగా జగన్ నివాసం పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. రైతులు చేపట్టే ఎటువంటి ర్యాలీలకు కానీ, నిరసనలకు కానీ అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. జగన్ క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే సమాచారం ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అన్ని గ్రామాల్లో, అన్ని కీలకమైన చోట్ల బందోబస్తు పెంచేశారు.
క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల అన్నీ తమ కంట్రోల్ లో కి తెచ్చుకుని, భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. జగన్ ఇంటి పరిధిలో కొత్త వారికి ఆశ్రయం కల్పించవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే అమరావతి రైతులు మాత్రం, ఈ ప్రచారాన్ని ఖండించారు. ఎవరో పుకార్లు పుట్టిస్తే, ఇలా తమ పై పోలీస్ జులం చూపించి, తామను నిర్బందిస్తారా, తమ గ్రామాల్లో, ఇళ్ళ మధ్య ఈ పోలీసులు ఏమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. స్వేచ్చగా తిరగనివ్వకుండా ఎవరో ఏదో పుకార్లు పుట్టిస్తే, తమ పై ఈ దౌర్జన్యం ఏమిటి అని ఖండించారు. జగన్ మోహన్ రెడ్డి భయం భయంగా, ఎవరో ఏదో చేస్తారని, శత్రువులు ఉన్నారని, భయంగా ఉండటం ఎందుకని, తమకు న్యాయం చేయవచ్చు కదా, తమ మోర ఆలకించవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ, ఇంత భద్రత ఎందుకని ప్రశ్నించారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నది వారే అని అన్నారు.