రాజధాని అమరావతికి సంబందించిన అనుబంధ పిటీషన్ల పై ఈ రోజు హైకోర్టులో విచారణ ముగిసింది. 23 రిట్ పిటీషన్లలో ఉన్న అనేక అనుబంధ పిటీషన్ల గురించి, ఈ రోజు వాదనలను తీసుకున్నారు. అయితే ఇందులో కొన్ని పిటీషన్లు న్యాయస్థానం ఇచ్చినటువంటి స్టేటస్ కో ఆదేశాల పరిధిలోకే వస్తాయని, ఇరు పక్షాల న్యాయవాదులు అంగీకరించారు. అయితే రెండు విషయాల్లో మాత్రం, ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగాయి. ఒకటి క్యాంప్ ఆఫీస్ విషయం, రెండు విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం. రెండు విషయాలు కూడా స్టేటస్ కో పరిధిలోకి తీసుకు రావచ్చ లేదా అనే దాని పై వాదనలు జరిగాయి. పిటీషనర్ న్యాయవాదులు క్యాంప్ ఆఫీస్ కు సంబంధించి వాదనలు చేసినప్పుడు, నిజంగా ముఖ్యమంత్రి గారి సౌలభ్యం కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టుకోకూడదు అని మేము అనటం లేదని, రాజధాని తరలింపులో భాగంగా, క్యాంప్ ఆఫీస్ పెడితేనే మాకు అభ్యంతరం అని చెప్పటం జరిగింది. దాని మీద ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, దాని పై తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. ఇక విశాఖపట్నం గెస్ట్ హౌస్ కి వచ్చే సరికి, దాని పై గతంలోనే చీఫ్ సెక్రటరీ గారు అఫిడవిట్ దాఖలు చేసారు. దాంట్లో వారు చెప్పింది, ఇది రాజధానిలో భాగం కాదని, రాష్ట్రంలో మంత్రులు, అధికారులు పర్యటన చేసేప్పుడు, ప్రైవేటు హోటల్స్ లో డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి, దాన్ని నివారించేందుకు మేము విజయవాడ, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ లు నిర్మాణం చెయ్యాలని నిర్ణయం చేసామని, అందులో భాగంగానే మేము విశాఖలో నిర్మాణం చేస్తున్నామని కోర్టుకు చెప్పారు.
అయితే పిటీషనర్ తరుపు న్యాయవాది స్పందిస్తూ, విశాఖపట్నం గెస్ట్ హౌస్ కు సంబంధించి వివరాలు ఇవ్వలేదని, గోప్యంగా ఉంచుతున్నారని, మిగతా చోట్ల అన్ని వివరాలు ఉన్నాయని, ఎంత విస్తీర్ణంలో ఎంత ఖర్చు అవుతుందో చెప్పారని, విశాఖలో మాత్రం చెప్పలేదని కోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరుపు న్యాయవాది స్పందిస్తూ, ఈ రిట్ పిటీషన్ పరిధి రాజధానికి సంబంధించి అని, రాజధానిలో భాగంగా కట్టటం లేదు అని చెప్పామని తెలిపారు. అయితే దీని పై కూడా వాదనలు ముగియటంతో, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది హైకోర్టు. ఇక మెయిన్ పిటీషన్ తప్పితే, ఈ అనుబంధ పిటీషన్లు అన్నీ ఆర్డర్స్ రిజర్వ్ చెయ్యటం జరిగింది. మెయిన్ పిటీషన్ పై కూడా రోజు వారీ విచారణకు సిద్ధం అని కోర్ట్ చెప్పగా, న్యాయవాదులు అభిప్రాయాలు, దసరా సెలవలు, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాత, నవంబర్ 2 నుంచి ఈ రోజు వారీ విచారణ జరుగుతుందని, వారికి 7 రోజులు, వీరికి 7 రోజులు ఇస్తాం అని, న్యాయస్థానంలో కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ వాదనలు వినిపించవచ్చని, కోర్టు తెలిపింది.