ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాల్లో రేపు బంద్ కు పిలుపునిచ్చారు, అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ముందుగా రేపు భారీ ఎత్తున బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నిరసనల్లో భాగంగా రిలే దీక్షలు, రహదారుల ముట్టడికి నిర్ణయం తీసుకున్నారు. ఆందోళనలో అన్ని గ్రామాల రైతులు పాల్గొంటారని వెల్లడించారు. మొదటి రోజు అయిన రేపు, రాజధాని గ్రామాల్లో రేపు బంద్ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులంటూ నిన్న అసెంబ్లీలో జగన్ ప్రకటించడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రోజు అమరావతి రైతులు నిరసన ప్రదర్శనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం రాజధాని రైతులు ఉద్దండరాయనిపాలెంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అన్ని రాజధాని గ్రామాల రైతులు హాజరయ్యారు.
భవిష్యత్ కార్యాచరణ పై, రైతులు సమాలోచనలు జరిపారు. ప్రభుత్వం పై ఒత్తిడి తేవటంలో భాగంగా, రేపు అమరావతి బంద్ పాటించాలని రైతులు పిలుపు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం దిగి వచ్చే దాకా , ప్రతి రోజు నిరసనలు చెయ్యాలని, రిలే నిరాహార దీక్షలు, రహదారుల ముట్టడి లాంటి నిరసన కార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా, ఆందోళనలో పాల్గొనాలని అన్ని గ్రామాల రైతులు నిర్ణయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, జగన్ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయంగా అభివర్ణించారు. అమరావతిని మూడు ప్రాంతాలుగా విడగొట్టడం చూస్తుంటే, ఒకటి గుర్తుకు వస్తుందని, ఎవరికైనా రోగం వస్తే చికిత్స ఒక ప్రాంతంలో, పరీక్షలు మరో ప్రాంతంలో, మందులు వేరే చోట తెచ్చుకునే విధంగా ఉందని అన్నారు.
ఇలా మూడు ప్రాంతాలు తిరిగితే, ఆ రోగి చచ్చిపోతాడని, ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం కూడా అలాగే ఉందని, రైతులు అన్నారు.ఆరు నెలలుగా మమ్మల్ని మానసిక క్షోభ పెట్టారని, అయినా జగన్ మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకున్నామని, కాని చివరకు మాకు చిప్ప మిగిల్చి, నిద్రాహారాల్లేకుండా చేసారని రైతులు ఆందోళన వ్యక్తం సెహ్సారు. ఇళ్ళల్లో ఉండే వారిని, ఎప్పుడు రోడ్డు ఎక్కని వారిని, ఈ రోజు మమ్మాల్ని రోడ్డున పడేశారని, మహిళలు వాపోయారు. మా పొలాలు ఇచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించారు. ఒక ప్రధాని శంకుస్థాపన చేసిన చోటుకే విలువ లేకపోతే ఎలాగని అన్నారు. మేము అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కాదని, పరిపాలన వికేంద్రీకరణ మాత్రం వద్దని, జగన్ నిర్ణయం మార్చుకోవాలని అన్నారు.