రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ.2 వేల కోట్ల విలువ చేసే ‘అమరావతి బాండ్లు’ ఈ నెలాఖరు నాటికి మార్కెట్‌లో విడుదల కానున్నాయి. ఈనెల 22 నాటికి వీటికి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, మరుసటి రోజు ప్రభుత్వ అనుమతులు తీసుకుని నెలాఖరులోగా మార్కెట్‌లోకి తీసుకు రానున్నారు. రాజధాని అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ బాండ్లకు సంబంధించిన వివరాలను సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ బాండ్లకు ఎ, ఎ ప్లస్, ఎఎ కేటగిరిల్లో క్రెడిట్ రేటింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అమరావతిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్ల చెల్లింపు అవసరాలకు, ఇతర అభివృద్ధి పనులకు ఈ బాండ్లు అక్కరకొస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు.

amaravati 18052018 2

రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ప్రాథమికంగా రూ.2వేల కోట్ల మేరకు వివిధ బాండ్ల ద్వారా సమీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. ఈ జారీచేస్తున్న బాండ్లతో పాటు ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ‘అమరావతి బాండ్లు’ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాజధాని నిర్మాణం కోసం ఎంతోమంది ముందుకొచ్చి ప్రతి రోజూ తనకు విరాళాలు అందిస్తున్నారని, ఈ నిధుల సేకరణను సక్రమంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నరసయ్య అనే వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి నేరుగా తన దగ్గరకు వచ్చి రాజధాని నిర్మాణం కోసం చెక్ ఇచ్చి వెళ్లాడని, మరొకరు తన రెండు నెలల పింఛను అందించారని, ఒక ప్రవాస మహిళ తనకోసం చాలా సేపు వేచి వుండి రూ.10 లక్షలు చెక్ ఇచ్చి వెళ్లారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

amaravati 18052018 3

కొత్త నగరంలో సామాజిక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి ఇక్కడ మరో 50 వేల జనాభా అదనంగా పెరుగుతుందని, రాజధానికి కొత్తగా వచ్చే వీరందరి కోసం కనీసం 12 వేల ఆవాసాలు అవసరం పడతాయని భావిస్తున్నామని, ఆమేరకు ప్రభుత్వ గృహ వసతి ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని కమిషనర్ చెప్పారు. అదనంగా వచ్చే జనాభా కోసం హోటళ్లు, మాల్స్, విద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర సదుపాయాలను త్వరతిగతిన సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ-ప్రైవేట్ పద్ధతిలో అతి పెద్ద మాల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అది వీలు కాని పక్షంలో తామే సొంతంగా మాల్ నిర్మాణాన్ని చేపట్టి తరువాత దాని నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలని యోచిస్తున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. దీంతో పాటు మధ్య, చిన్న తరహా మాల్స్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై తదితర నగరాలలో ఉన్న కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాల కోసం తగినంత స్థలాన్ని కేటాయించాలని అభ్యర్ధనలు వస్తున్నాయని, దీనికోసం ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకురావాల్సి వుందని కమిషనర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

పరిపాలన నగరంలో చేపట్టనున్న అన్ని ప్రభుత్వ భవంతుల నిర్మాణాలకు సంబంధించి జూన్ 16 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల నిర్మాణం నెలాఖరు నాటికి టెండర్ దశను పూర్తిచేసుకుని పునాదుల స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ముఖ్యుల బంగ్లాల నిర్మాణం పునాదుల దశలో ఉందన్నారు. పునాదుల నిర్మాణంలో అంతర్జాతీయంగా పేరొందిన ‘కెల్లార్’ వంటి సంస్థలను భాగస్వామ్యుల్ని చేయాలని ముఖ్యమంత్రి ఆయనకు చెప్పారు.

6 ఎల్‌పీఎస్ జోన్లలో చేపట్టిన అండర్ గ్రౌండ్ అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని కమిషనర్ చెప్పారు. ఉండవల్లి, పెనుమాక మినహా మిగిలిన అన్ని గ్రామాలలో లే అవుట్ల అభివృద్ధి పనులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. సీఆర్‌డీఏకు వెలుపల ఉన్న ప్రాంతంలో ప్రధాన రహదారి విస్తరణకు కొన్ని ఇబ్బందులు వున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఉండవల్లి నుంచి తాడేపల్లి వెళ్లే మార్గంలో రహదారి విస్తరణకు ఉన్న ఇబ్బందులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read