రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సిఆర్డీయే అధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఐఏఎస్, ఇతర అధికారుల నివాసాలకు సంబంధించిన ఆరు టవర్ల నిర్మాణం డిసెంబర్ లోగ పూర్తి చేయడానికి పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. టవర్ల ఆకర్షణీయంగా , ఉన్నత నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులకు ఒక టవర్ లో నివాసాలను కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రతి నెల రాజధాని పనుల ప్రగతి వివరాలను విడుదల చేయమని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాజధాని నవనిర్మాణం కోసం స్వచ్ఛందంగా అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని , మనం చేసే పనులు వారికి స్ఫూర్తిని కలిగించాలని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని అభివృద్ధి పనులకు చేపట్టిన సిఆర్డీయే బాండ్ల కార్యక్రమంలో బిడ్డింగ్ వచ్చే మంగళవారం జరుగుతుందని అధికారులు వివరించారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్ఈ )లో లిస్టింగ్ కు వెళ్తున్నామని, ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. 10.3 శాతం వడ్డీ రేటుతో బాండ్లు విడుదల చేస్తున్నారు. రాజధాని రైతుల భూముల రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడానికి మరో డిప్యూటీ కలెక్టర్ నియమించుకోమని ముఖ్యమంత్రి సూచించారు.
మరి కొన్ని గ్రామాలకు చెందిన రైతులను సింగపూర్ పర్యటనకు పంపడానికి సీఎం అంగీకరించారు. డిసెంబర్ కల్లా విజయవాడ, గుంటూరు లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధాన కాలువల చుట్టూ సుందరీకరణ వేగవంతం చేయాలని అన్నారు. తిరుపతిలో 27 కిలోమీటర్లు ప్రాంతం మేర స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అభివృద్ధి పై ముఖ్యమంత్రి సమీక్షించారు. తిరుపతి లో అలిపిరి నుంచి ఉన్న అత్యంత రద్దీ ప్రాంతాలను కలుపుతూ వివిధ ప్రాంతాలను స్మార్ట్ స్ట్రీట్ గా అభివృద్ధి చేయడానికి ఉన్న ప్రతిపాదనలను చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వివరించారు. స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ లో భాగంగా లక్ష్మీపురం నుండి అలిపిరి వరకు స్మార్ట్ ఫ్లై ఓవర్ ఏర్పాటుకు ప్రతిపాదన ఉందని అన్నారు.
రాష్ట్రంలో ప్రారంభించిన అన్న కాంటీన్ ల గురించి మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అన్న కాంటీన్ల నిర్వహణ ఉండాలని పురపాలక డైరెక్టర్ కన్నబాబు ను సూచించారు. ఇప్పటికే 66 అన్న కాంటీన్లు ప్రారంభమయ్యాయి. మరో వంద కాంటీన్లను ఆగష్టు 15వ తేదీకల్లా ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహనిర్మాణం ప్రగతిని కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
సర్వాంగ సుందరంగా వాటిని తీర్చిదిద్దాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలన్నిటిని అన్ని మాధ్యమాల్లో ప్రజలకు తెలిసేలా చేరవేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీక్షలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, అజేయ్ జైన్, సీఆర్డీఏ కమీషనర్ సిహెచ్. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.