మే6న విశాఖకు వెళ్ళిపోతున్నాం అంటూ, గత కొన్ని రోజులుగా రాజధాని తరలింపు ప్రక్రియకు సంబంధించి చేస్తున్న హడావిడికి మళ్ళీ బ్రేక్ పడింది. రాజధాని కేసులన్నీ మే 3వ తేదీ నుంచి మళ్లీ మొదటినుంచి విచారణ ప్రారంభించాలన్న హైకోర్టులో నిర్ణయంతో ఈ ఏడాది కూడా రాజధాని తరలింపు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం మంచిదనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు సచివాలయ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. అమరావతి రాజధాని మార్పునకు సంబంధించి హైకోర్టులో దాదాపు వంద పిటిషన్లున్నాయి. ఇవన్నీ కలిపి రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. అయితే విచారణ ఎంత వేగంగా నిర్వహించినా కనీసం తుది తీర్పు వెలువడడానికి కనీసం మూడు నెలలు పైనే పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో 2021-22 విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడంతో ఉద్యోగస్తుల పిల్లలకు ఇబ్బంది కనుక, మరో ఏడాది వాయిదా వేసుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం సాగుతున్న తరుణంలో సమస్య ఉన్న చోటుకి వెళ్ళడం మంచిది కాదనే భావనలో పాలక పెద్దలున్నారు. ఇంకోవైపు సెకండ్ వేవ్ విజృంభిస్తుండడం, వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో ఉద్యోగులపై కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇంకోవైపు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపు అన్ని విధాలా ఇబ్బందేనని గమనించిన ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.
అభివృద్ధి వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి పేరుతో వైసీపీ సర్కారు తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినా, ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏడాదిన్నరగా విశాఖకు రాజధాని తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడం లేదు. రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదమైంది. వాస్తవానికి గత ఏడాది జనవరి 26నాటికే విశాఖకు రాజధాని తరలుతుందన్న ప్రచారం జరిగింది. సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ఆయా కార్యాలయాల తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆదేశాలు కూడా వెళ్ళాయి. సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్ భవన్, డీజీపీ కార్యాలయం, సచివాలయం, హెచ్ఓడీలు తాత్కాలిక ఏర్పాటుకు అవసరమైన భవనాలను కూడా విశాఖలో గుర్తించారు. ఈ ప్రయత్నాలపై రైతులు పెద్దసంఖ్యలో పిటిషన్లు దాఖలు చేయడంతో హైకోర్టు రాజధాని తరలింపునకు బ్రేక్ వేసింది. కోర్టు తీర్పు ఇచ్చేవరకు ఏ ఒక్క కార్యాలయాన్ని విశాఖకు తరలించినా ఆశాఖా కార్యదర్శి బాధ్యత వహించాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది.