మూడు రాజధానులు అంటూ, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించటం పై, గత 12 రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న అర్ధరాత్రి, అమరావతి రైతులకు పోలీసులు షాక్ ఇచ్చారు. అమరావతిలోని రైతులు ఇళ్ళలో, నిన్న రాత్రి పోలీసులు సోదాలు నిర్వచించారు. ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు సోదాలు చేసిన పోలీసులు, తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడం గ్రామానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల చర్యల పై రైతులు ఆగహ్రం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నంలో, తమని భయపెట్టటానికి, ప్రభుత్వం కుట్ర పన్నింది అని రైతులు వాపోతున్నారు. అర్దరాత్రి దాటిన తరువాత తమ ఇళ్ళ పై సోదాలు జరిపి, అదుపులోకి తీసుకోవటానికి తాము ఏమి దొంగలం కాదని వాపోయారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను విడుదల చెయ్యాలని రైతులు కోరారు. లేకపోతే, పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
రైతుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం అని ఏపి టిడిపి అధ్యక్షుడు, కళా వెంకట్రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ "ప్రజా రాజధాని అమరావతి పరిధిలో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు గర్హణీయం. అర్ధరాత్రి దాటాక రైతుల ఇళ్లలోకి వెళ్లి వారిని భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు వ్యవహరించడం దుర్మార్గం. ఉగ్రవాదులను పట్టుకోవడానికి వెళ్లినట్లు అర్ధరాత్రి వెళ్లి రాజధాని కోసం భూములు దారాదత్తం చేసిన రైతుల ఇళ్లలోకి చొరబడతారా.? ఆధార్ కార్డు ఉంటేనే స్వగ్రామాల్లోకి అనుమతిస్తారా.? లేదంటే పొలిమేరల్లోనే అడ్డుకుంటారా.? శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై అక్రమ కేసులు పెడతారా.? ఆంక్షల పేరుతో ఉద్యమాన్ని అడ్డుకోవడం నిరంకుశత్వం. అసలు మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో అనే విషయం గుర్తుందా.?"
"ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం.. వారి గొంతు నొక్కేలా వ్యవహరిస్తుంటే.. ప్రశ్నించడం తప్పా.? ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అలా కాకుండా నిరంకుశత్వంగా, నియంత మాదిరిగా అణచివేయాలని చూస్తే ప్రజలే తిరుగుబాటు చేస్తారు. వేధింపులు, అణచివేతలు వంటి చర్యలతో ప్రజా ఉద్యమాలను ఆపడం ఎవరి వల్లా సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి. చరిత్రలో నియంతలెవరూ ప్రజా ఉద్యమాల ముందు నిలవలేకపోయారు. ప్రజా ఉద్యమాలకు, వారి తిరుగుబాటుకు దేశాలు, రాజ్యాలే కూలిపోయాయి. మీరెంత..? ప్రజలపై విజ్ఞత చూపించాల్సిన ప్రభుత్వం.. పగలు, ప్రతీకారాలు, విధ్వేషాలు చూపడం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదు. రైతుల విషయంలో మీ అమానుష వ్యవహార శైలిని మార్చుకోకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్తుంచుకోండి." అని కిమిడి కళా వెంకట్రావు అన్నారు.